యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయాలకు బంధుత్వాలు, రక్తసంబంధాలు అతీతం కాదు. రాజకీయాల్లో సొంత అన్నదమ్ముళ్లే ప్రత్యర్థులుగా తలపడిన సందర్భాలు అనేకం. ఇందుకు ఇంకా భిన్నంగా మినహాయింపేమీ కాదని నిరూపించారు దగ్గుబాటి దంపతులు. విచిత్రం ఏంటంటే భార్య భర్తలుగా ఉండి కూడా వీరిద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉండడంతో పాటు ఉత్కంఠ రేపిన ఏపీ ఎన్నికల్లో వేరు వేరు పార్టీల నంచి పోటీ చేసి ఏపీ ఎన్నికలకే ఓ హైలెట్‌గా నిలిచారు. కేంద్ర మాజీ మంత్రిగా పని చేసిన దగ్గుబాటి పురందేశ్వరి గత ఎన్నికలకు ముందు బీజేపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం సూచన మేరకు ఆమె గతంలో ఎంపీగా ఉన్న విశాఖపట్నం నుంచి మరో సారి రంగంలోకి దిగారు. అదే టైమ్‌లో పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏడేళ్ల రాజకీయ సన్యాసం తర్వాత వైసీపీ నుంచి తన సొంత నియోజకవర్గమైన పర్చూరులో ఎమ్మెల్యేగా పోటీ చేశారు.భార్య, భర్తలు ఇద్దరూ గతంలో కాంగ్రెస్‌లో ఉండి పదవులు అనుభవించి ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. కేవలం రాజకీయ అవసరాల నేపథ్యంలో వేరు వేరు పార్టీల నుంచి ఒకేసారి ఎన్నికల బరిలో ఉండడంపై తెలుగు రాజకీయ వర్గాలు, మీడియాలో అనేక చర్చలు జరిగాయి, విమర్శలు వచ్చాయి. ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి, ప్రజల అభిప్రాయంతో పాటు పోలింగ్ అంచనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక వీరిద్దరు పోటీ చేసిన నియోజకవర్గాల్లో పరిస్థితి, పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఇద్దరూ ఓటమి బాటలోనే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. విశాఖలో నలుగురు ఉద్దండుల మధ్య జరిగిన సమరంలో పురందేశ్వరి చేతులు ఎత్తేశారు. ఎన్టీఆర్ కుమార్తెగానూ, గతంలో విశాఖలో ఎంపీగా గెలిచిన అనుభవం, కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నా కూడా విశాఖలో విశాఖ ప్రజలు ఆమెకు ఓటు వేసేందుకు ఇష్టపడలేదు. గత ఎన్నికల్లో విశాఖ ప్రజలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంభంపాటి హరిబాబును గెలిపించడం, నార్త్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరో సారి బరిలో ఉండడం తనకు కలిసి వస్తుందని పురందేశ్వరి అనుకున్నా ఓటర్లు బీజేపీకి ఓటు వేసేందుకు ఏ మాత్రం మొగ్గు చూపలేదుఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ సభ తుస్సు మన్న సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన నాలుగు స్తంభాలాటలో పురందేశ్వరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నా పెద్ద విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ సొంత నియోజకవర్గం పర్చూరులో వైసీపీ జెండా కప్పుకోకుండానే ఆ పార్టీ బీఫామ్ంపై పోటీ చేసిన వెంకటేశ్వరరావుకు పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. పర్చూరు నుంచి దగ్గుబాటి తన కుమారుడు చెంచు రామ్ హితేష్ ను పోటీ చేయించాలని అనుకున్నా చివరిలో చెంచు రామ్‌కు అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెంకటేశ్వరరావే రంగంలో ఉండాల్సి వచ్చింది. పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ముందు దగ్గుబాటి ప్రచారంలోనే పూర్తిగా తేలిపోయారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చెయ్యని దగ్గుబాటి ప్రజల్లోకి చొచ్చుకుపోలేకపోయారు. దీనికి తోడు ఐదేళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో దగ్గుబాటిని పర్చూరు ప్రజలు తిరస్కరించినట్టే ఓటింగ్ సరళి చెప్పేసింది. ఏదేమైన చెరో పార్టీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి దంపతులు ఇద్దరూ ఓటమి మూటకట్టుకోవడం ఖాయమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.