YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మరాఠలో ఆసక్తికర పోరు

 మరాఠలో ఆసక్తికర పోరు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మహారాష్ట్ర ….దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో జనాభా పరంగా, లోక్ సభ నియోజకవర్గాల పరంగా యూపీ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. దేశ ఆర్థిక రాజధాని ప్రాంతం. 48 లోక్ సభ స్థానాలు. 11.23 కోట్ల జనాభా, 8.73 కోట్ల ఓటర్లు కలిగిన ఈ రాష్ట్రాన్ని రాజకీయంగా విస్మరించడం అసాధ్యం. విదర్భ,కొంకణ్, మారట్వాడా ప్రాంతాలతో కూడిన మహారాష్ట్ర ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. ఈ నెల 11వ తేదీ మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగా.. 18, 23, 29 తేదీల్లో నాలుగు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. రాష్రంలో రెండు ప్రధాన జాతీయ పార్టీలు, రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.గత ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ – ఎన్సీపీ, బీజేపీ – శివసేన మళ్లీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి తన శక్తియుక్తులను కూడదీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 25, శివసేన 23 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 స్థానాల్లో బరిలోకి దిగాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్, ఆయన కూతరు సుప్రియా శూలే, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సమితి కి చెందిన రాజ్ ఠాక్రే లు మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కీలక పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికలలో బీజేపీ 23, శివసేన 18, ఎన్సీపీ 4, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఈ సారి ఈ అంకెలు మారనున్నాయి. ఐదేళ్లలో బీజేపీ-శివసేన బంధం ఉప్పునిప్పులా ఉంది. రాష్ట్ర బీజేపీ, కేంద్ర బీజేపీ సంకీర్ణ సర్కార్ లో శివసేన భాగస్వామి. అయినప్పటికీ అనేక అంశాలపై తరచూ శివసేన బీజేపీపై విమర్శలు రువ్వేది. సర్కారులో ఉంటూనే సూటిపోటి మాటలతో సతాయిస్తూ ఉండేది. ఒక దశలో రెండు పార్టీల మధ్య పొత్తు అసంభవమని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. సీట్ల పంపకంపై కూడా పెద్దగా తేడాలు రాలేదు. రెండు పార్టీలు సంయమనంగా వ్యవహరించాయి. హిందుత్వ సిద్ధాంతాలు, భావజాలాన్ని నరనరాన ఒంటబట్టించుకున్న పార్టీలు తమలో తాము కొట్లాడుకుంటే తేలిపోతామన్నఅభిప్రాయంతో సర్దుకుపోయారు. అయితే వ్యవసాయం సంక్షోభం, మరాఠా రిజర్వేషన్ల అంశం, భీమా కొరెగావ్ అల్లర్లు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. అన్నదాతల ఆత్మహత్యలు, రుణమాఫీ పథకం అమలులో వైఫల్యం తదితర అంశాలు అధికార కూటమికి మైనస్ పాయింట్లుగా చెప్పాలి. ఒకప్పుడు కాంగ్రెస్ కు పెట్టనికోట అయిన మహారాష్ట్రలో మళ్లీ పూర్వ వైభవానికి హస్తం పార్టీ కృషి చేస్తోంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు ముందుకు వెళుతున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఎన్నికలకు దూరంగాఉంటున్న పవార్ సొంత నియోజకవర్గమైన బారామతి నంుచి కూతురు సుప్రియా సూలేను బరిలోకి దించారు. మరో సమీప బంధువు పార్థ్ పవార్ ను కూడా రంగంలోకి దించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి తన స్థానాలను పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. కానీ ఇది అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ సంక్షోభం, అన్నదాతల ఆత్మహత్యలు, బీమా-కోరెగావ్ అల్లర్లు, రుణమాఫీ పథకం అమలులో ప్రభుత్వ వైఫల్యం తదితర అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేయనున్నాయని చెబుతున్నారు. మహరాష్ట్ర రైతులు రోడ్డెక్కి తమ నిరసనను బహిరంగంగా తెలియజేశారు. ఢిల్లీ వరకూ పాదయాత్ర కూడా నిర్వహించారు. గత , ప్రస్తుత ఎన్నికల్లో శివసేన బీజేపీ సంకీర్ణ భాగస్వామిగా ఉంది. కానీ గత అయిదేళ్లుగా రెండు పార్టీల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారింది. చివరకు అమిత్ షా దౌత్యం ఫలించడంతో కలసి పోటీ చేస్తున్నాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఈ ఎన్నికల్లోపోటీకి దూరంగా ఉంది. అయితే తాము ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు రాజ్ ఠాక్రే వెల్లడించారు. మొత్తం మీద ఈ పశ్చిమ రాష్ట్రంలో నాలుగు పార్టీల మధ్య రాజకీయ చదరంగం నడుస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్న మాట వాస్తవం.

Related Posts