యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తనను చంపేందుకు కుట్ర జరిగిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన కారు చక్రాల బోల్టులు తొలగించి తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఎత్తి విషయమై డీజీపీకి ఫిర్యాదు చేసినా విచారణ మాత్రం జరగడం లేదని వాపోయారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిగేలా చూడాలని ద్వివేదిని కోరానని చెప్పారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తనను తెలుగు దేశం పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఇటీవల టీడీపీలో చేరినట్టు వెల్లడించారు. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని హర్షకుమార్ మండిపడ్డారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ అనే పదం ఎక్కడా లేదని, కాలేజీల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఇంటర్ ఫీజులపై న్యాయపోరాటం చేస్తున్నానని, హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ప్రభుత్వం నిర్దారించిన ఫీజు కేవలం రూ.2,800 మాత్రమేనని, ప్రోత్సాహకం పేరుతో ప్రభుత్వం 35 వేల ఫీజు కొంతమందికి ఎలా చెల్లిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాగా, ఇంటర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై హర్షకుమార్ దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఈనెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.