యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11న పోలింగ్ రోజు జరిగిన సంఘటనపై 13 జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వివరణ కోరారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలింగ్ జరగడానికి కారణాలను ఆయా జిల్లాల కలెక్టర్లు రాతపూర్వకంగా వివరించాలని సీఈవో ద్వివేది ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినవారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గానికి ముగ్గురు భెల్ నిపుణుల్ని కేటాయించినా వారి సేవల్ని వినియోగించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో రూట్ మ్యాప్‌లు కూడా సాంకేతిక నిపుణులకు ఇవ్వకపోవడాన్ని ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి 600మంది భెల్ ఇంజినీర్లు వచ్చినా జిల్లా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యరవహరించడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆర్వో ఈవీఎంలను ఆలస్యంగా అప్పగించడం (పోలింగ్ ముగిసిన తర్వాత రోజు ఈవీఎంలను అప్పగించిన ఆర్వో), రాజంలో మైనర్లు ఓటు వేసిన ఘటనల్లో వెంటనే నివేదికలు పంపాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అలాగే మరికొందరు అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ద్వివేది పేర్కొన్నారు.