ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో జమ్మల మడుగు నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ నిజానికి తెలుగుదేశం పార్టీ అత్యంత సులువుగా గెలవాలి. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గ్యారంటీగా వచ్చే సీట్లలో ఇదొకటి. అయితే అది పోలింగ్ కు ముందు మాత్రమేనంటున్నారు. పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత వెలువడిన విశ్లేషణలు చూస్తే జమ్మల మడుగులో టీడీపీ విజయం అంత సులువుకాదన్నది అర్థమవుతోంది. ఇక్కడ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడం కూడా అనేక సందేహాలకు తెరలేపుతున్నాయి.జమ్మలమడుగులో దశాబ్దకాలంగా శత్రువులుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాలు ఏకమయ్యాయి. అప్పటి వరకూ మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డికి కడప ఎంపీ స్థానాన్ని, జమ్మలమడుగు నియోజకవర్గాన్ని రామసుబ్బారెడ్డికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించింది. ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ముందుగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. దీంతో రెండు వర్గాలు ఒక్కటయితే జమ్మలమడుగులో సులువుగా టీడీపీకి విజయం దక్కుతుందని చంద్రబాబు వ్యూహం. అందరూ టీడీపీదే విజయమని అనుకున్నారు.అయితే నేతలు కలసినంత సులువుగా క్యాడర్ కలవలేదన్నది పోలింగ్ అనంతరం తెలుస్తోంది. జమ్మల మడుగు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పెట్టని కోట కావడంతో అక్కడ ఎవరిని పోటీకి దింపినా తమదే విజయమని తొలుత వైసీపీ భావించింది. ఇద్దరు నేతలు ఏకమవుతారని వైసీపీ కూడా తొలుత ఊహించలేదు. ఇద్దరు నేతలు ఏకమవ్వడంతో ఒక దశలో వైసీపీ కూడా ఆందోళనలోకి వెళ్లింది. అందుకే వైఎస్ వివేకానందరెడ్డిని జమ్మలమడుగుకు ఇన్ ఛార్జిగా జగన్ నియమించారంటారు. అయతే పోలింగ్ సరళిని చూస్తే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు ఏకమయినప్పటికీ వారి క్యాడర్ మాత్రం ఒకటికాలేదంటున్నారు.వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి. సీనియర్ నేత మైసూరారెడ్డికి దగ్గర బంధువు. సుధీర్ రెడ్డికి రాజకీయ అనుభవం లేకపోయినా మంచి పేరుండటం ఆయనకు కలసి వచ్చిందంటున్నారు. జమ్మల మడుగులో క్యాడర్ బలంగా ఉండటంతో పాటు ఎక్కడికక్కడ టీడీపీ అక్రమాలను అడ్డుకుందని చెబుతున్నారు. వైఎస్ వివేకాహత్య ప్రభావం కూడా ఇక్కడ పనిచేసిందంటున్నారు. బలమైన ఇద్దరు నేతలు ఏకమైనప్పటికీ జమ్మల మడుగులో తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరు మీద నడక కాదన్నది విశ్లేషకుల అంచనా. ఈ నియోజకవర్గంలో గెలుపోటములపై జోరుగా పందేలు కాస్తుండటం విశేషం. జమ్మలమడుగులో పెరిగిన ఓటింగ్ ఎవరికి కలిసొస్తుందనే అంచనాల్లో రెండు పార్టీల నేతలు ఉన్నారు.