విశాఖ జిల్లాలో టీడీపీ కంచుకోట భీమునిపట్నం కంచుకోటను ఈసారి ఎన్నికల్లో పగలకొడుతున్న ఘనత అచ్చంగా అవంతి శ్రీనివాసరావు సొంతం చేసుకోబోతున్నారు. పోలింగు జరిగిన తీరు చూస్తే అవంతి అక్కడ ఎమ్మెల్యే కావడం ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది. సరిగ్గా పదేళ్ళ క్రితం 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున గెలిచిన అవంతి ఇపుడు వైసీపీ గుర్తు మీద విజయం సాధిస్తుండటం విశేషమే. మధ్యలో 2014 ఎన్నికల్లో టీడీపీ జెండా మీద కూడా అయన అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఇలా పదేళ్ళ కెరీర్లో మూడు పార్టీలు మార్చినా గెలుపు అన్నది ఆయనకు సొంతం కావడం అంటే మామూలు విషయం కాదు.ఇక అవంతి భీమిలి అభ్యర్ధి అనగానే గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఇక ఆయన మీద పోటీకి నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు, జేడీ లక్ష్మీ నారాయణ చాలా పేర్లు వచ్చినా చివరికి సీనియర్ నేత, కాంగ్రెస్ ముతక తరానికి చెందిన సబ్బం హరికి తెచ్చిపెట్టేసరికి అవంతి గెలుపు ఖాయమని మరో మారు అనుకున్నరంతా. ఇక హరి టీడీపీలో చేరి ఎన్ని పదనిసలు పలికించాలో అన్నీ చేశారు. ఓటర్ల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ కి ఓటేయండని తన పాత బాణీలోనూ కోరారు. తమ్ముళ్ళు హరి పోకడలు గిట్టక రగిలిపోయినా నమ్ముకున్న పసుపు జెండా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. అయినా అవంతి వైపే మొగ్గు బాగా కనిపిస్తోంది. మెజారిటీ మొదట యాభై వేల నుంచి వేసుకున్నా టీడీపీ కూడా గట్టి పోటీ ఇవ్వడంతో ఇపుడు అందులో సగమైన మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.అవంతి గెలిస్తే విశాఖలో వైసీపీకి ఇదే తొలి సీటు అవుతుందని అంటున్నారు. విశాఖలో ఇంత పక్కాగా చెప్పే సీటు ఇపుడు ఇదే కావడం విశేషం. ఇంతకు ముందు టీడీపీకి ధీమాగా ఉండే ఈ సీటును ఇటు ఫ్యాన్ పార్టీ వైపు తిప్పిన ఘనత అవంతిదే అంటున్నారు. అవంతిని గెలిపించడానికి అనెక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో బలమైన కులం, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి పరిచయాలు, రేపటి రోజున ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆశ అన్నీ కలసి అవంతిని గెలిపించాయని అంటున్నారు. నిన్నటి వరకూ అక్కడ పనిచేసిన గంటా శ్రీనివాసరావు మంత్రి అయ్యారు. ఇపుడు అవంతి కూడా మంత్రి అవుతారని భీమిలీ వాసులు అంటున్నారు. చూడాలి మరి.