జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతియ్యనున్నారా ? ఈ ఎన్నికల్లో పవన్ కారణంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో సైతం ఆ పార్టీ ఓటు బ్యాంకు భారీగా చీలిపోనుందా ? అంటే ఉభయగోదావరి జిల్లాలు, విశాఖలో జరిగిన పోలింగ్ సరళిని అంచనా వేస్తోన్న రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ ఎన్నికల్లో కనీసం జనసేన కారణంగా తెలుగుదేశం 15 నుంచి 20 నియోజకవర్గాల్లో ఓడిపోనుందని తెలుస్తోంది. అలాగే టీడీపీ కనీసం 10 నుంచి 15 సీట్లలో మూడో స్థానానికి పడిపోనుందని కూడా ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే నివేదికలు చంద్రబాబు దగ్గరకు చేరినట్టు తెలుస్తోంది. జనసేన, వామపక్షాలు విడిగా పోటీ చెయ్యడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు లబ్ధి కలుగుతుందని ముందుగా చంద్రబాబు అంచనా వేశారు. వాస్తవంగా పోలింగ్ జరిగిన తీరును చూస్తే జనసేన వల్ల టీడీపీకి చివరకు పెద్ద ఎఫెక్ట్ పడినట్టు తెలుసుకుని టీడీపీ వాళ్లు సైతం షాక్‌లోనే ఉన్నారు.ఎన్నికలు పూర్తి అయ్యాక పోలింగ్ సరళిని అంచనా వేసుకుంటున్న టీడీపీ నేతలకు పవన్ చీల్చిన ఓట్లపై లోలోన తీవ్రమైన ఆందోళనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లా, చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, మదనపల్లి అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్, ధర్మవరం కర్నూలు జిల్లాలో నంద్యాల లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇక ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో రెండు చోట్ల, తూర్పుగోదావరి జిల్లాలో మరో నాలుగు చోట్ల టీడీపీ మూడో ప్లేస్‌లోకి వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం ప్రాధమికంగా అంచనాకు వచ్చేశారు. గత ఎన్నికల్లో పవన్ సపోర్ట్‌తో ఉభయగోదావరి జిల్లాలు, విశాఖలో టీడీపీకి వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు జనసేన ఒంటరి పోరుతో ఈ మూడు జిల్లాల్లోనూ టీడీపీకి దారుణమైన దెబ్బ తగలబోతుందని తేలింది. మూడు జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్ పార్టీ తక్కువలో తక్కువగా 5000 నుంచి గరిష్టంగా కొన్ని చోట్ల 40,000 వరకు ఓట్లు చీల్చుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు లేకపోయినా రహస్య ఒప్పందం ఉందన్న విషయాన్ని వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం కూడా టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. కాపు సామాజికవర్గంలో కొంత మంది సైతం మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తారేమో అన్న కారణంతో చాలా వరకు జగన్ వైపు మళ్లారని విశ్లేషిస్తున్నారు. కాపుల్లో మెజారిటీ వర్గం జనసేన వైపు ఉండగా మిగిలిన వారి ఓట్లను టీడీపీ, వైసీపీ పంచుకున్నాయి. దీని వల్ల గత ఎన్నికల్లో టీడీపీకి కలిసివచ్చిన ఓటు బ్యాంకు కాస్త ఇప్పుడు ఆ పార్టీకి భారీగా గండిపడినట్లు అయ్యింది. దీనికి తోడు ఈ రెండు జిల్లాల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. చంద్రబాబు ఎన్నికలకు ముందు కనీసం 12 మందిని మార్చాలని అనుకున్నా తీవ్రమైన ఒత్తిడిలు, సరైన అభ్యర్థులు దొరక్కపోవడంతో తిరిగి వారికే సీట్లు ఇచ్చారు.ఐదేళ్ల పాటు కేడర్‌ను సైతం పట్టించుకోని ఎమ్మెల్యేలపై ఈ ఎన్నికల్లో కేడర్ కసి తీర్చుకున్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో కేడర్ సహకరించకపోవడం, రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చెయ్యకపోవడం, ఇక్కడ నుంచి పట్టిసీమ నీరు తీసుకువెళ్లి కృష్ణా డెల్టాకు ఇస్తున్నా పక్కనే ఉన్న తమను పట్టించుకోకపోవడం, టీడీపీ నేతల ఇసుక దోపిడిపై ప్రజలు సైతం తీవ్రమైన అసంతృప్తితో ఉండడం… ఈ పరిణామాలన్ని ఇక్కడ టీడీపీ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ లెక్కల చూస్తుంటే గత ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేసిన గోదావరి జిల్లాల ప్రజలే ఆ సారి ఆయన్ను ఇంటికి పంపుతున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఒకటైతే పవన్ దెబ్బకు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం మూడో ప్లేస్‌తో సరిపెట్టుకోనున్నారు. 2009లో చిరు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కాపు సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ మూడో స్థానంలో సరిపెట్టుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి మూడో స్థానమే దిక్కు అయ్యింది. ఇప్పుడు కూడా చాలా చోట్ల అదే పరిస్థితి నెలకొంది.