YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ విధానాలు...శాపంగా మారాయా...

మోడీ విధానాలు...శాపంగా మారాయా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

2014 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా నమో….మోడీ అన్న పదం మారుమోగిపోయింది. మెట్రో నగరాల నుంచి, పట్టణాలు పల్లెల వరకు మోడీ ప్రధాన మంత్రి అయితే భారతదేశపు భవిష్యత్తు మారిపోతుందని, దేశం తిరుగులేని విధంగా అభివృద్ధి చెందుతుందని, మోడీ భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలబెడతాడని అందరూ ఎన్నో కల‌లు కన్నారు. గుజరాత్‌లో మోడీ చేసిన అభివృద్ధిని నేష‌న‌ల్‌ మీడియా ఆకాశానికి ఎత్తుతూ పాపులర్‌ చెయ్యడంతో సహజంగానే మోడీపై భారతదేశ జనాల్లో మితిమీరిన నమ్మకం ఏర్పడిపోయింది. కట్‌ చేస్తే ఐదేళ్లలో పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అయ్యింది. మోడీ తీసుకువచ్చిన కొన్ని సంస్కరణల వల్ల అంతిమంగా కలిగిన ప్రయోజనం కంటే సామాన్య జనం ప‌డ్డ బాధ‌లే ఎక్కువ‌య్యాయి. ఒక్క సారిగా మార్పు తీసుకురావాలన్న మోడీ విధానం అనుకున్నంతగా సక్సెస్‌ కాలేదు. ఇందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా తగిన ప్రత్యామ్నాయ‌ మార్గాలు కూడా మోడీ ఆలోచించినట్టు లేదు.ఈ క్రమంలోనే ఐదేళ్ల పాలనలో మోడీ అనుసరించిన విధానాలు ఇప్పుడు బీజేపీ, ఎన్డీయేకు పెను శాపంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని గత ఎన్నికల్లో ఒంటరిగా సాధించిన బీజేపీ ఇప్పుడు ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి అయినా సాధిస్తుందా ? అన్న సందేహాలు ఆ పార్టీ అంతర్గత చర్చల్లోనే వినవస్తున్నట్టు టాక్‌. వాస్తవంగా చూస్తే మోడీ నియంతృత్వ విధానాలు, రాష్ట్రాలను పూర్తిగా అణగతొక్కి, సమైక్య వ్యవస్థ‌కు తూట్లు పొడిచేలా ఆయన ఐదేళ్ల పాలన కొనసాగింది. దేశంలో బీజేపీకి ప్రధాన రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్‌ పార్టీని అణగతొక్కడంతో పాటు అదే క్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్న టార్గెట్‌గానే మోడీ ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్నికల పర్వం ప్రారంభం ముందు వరకు కొన్ని సీట్లు తగ్గినా.. మిత్ర పక్షాలతో అయినా ఎలాగైనా అధికారంలోకి వస్తానని బీరాలు పోయిన బీజేపీ నాయకులు…. ఇప్పుడు అంతర్గతంగా చేయించుకున్న సర్వేల ఫలితాలతో లోలోపల తీవ్ర ఆందోళనతో ఉన్నా… పైకి మాత్రం మేకపోతు గాంబీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.మళ్లీ అధికారం మాదే అని నిన్నటి వరకు కల‌ల ఊహాలోకంలో వ్యవహరించిన మోడీ & టీం ఇప్పుడిప్పుడే ఆ భ్ర‌మల నుంచి బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం బీజేపీ వాళ్లు వేసుకున్న అంతర్గత లెక్కల ప్రకారం చూసినా ఢిల్లీ పీఠం దక్కించుకునేందుకు కీలకం అయిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఈ సారి 30 సీట్లు రావడమే గగనంగా ఉంది. అక్కడ అఖిలేష్‌, మాయావతి కలిసి పోటీ చేస్తుండడంతో బీజేపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ రెండు పార్టీలకు తోడు ఆర్‌ఎల్డీ కూడా తోడు అయ్యింది. ఇప్పటికే మూడు ఉప ఎన్నికల్లో ఆ కూటమి బీజేపీ సిట్టింగ్‌ సీట్లు లాగేసుకుంది. దీంతో ఇక్కడ అధికార బీజేపీకి భారీ దెబ్బ పడనుంచి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌లో 20, గుజరాత్‌లో 20, రాజస్థాన్‌లో 15, బీహార్‌లో 10, కర్నాటకలో 12, మహారాష్ట్రలో 12 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇంకా చెప్పాలంటే గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గుజరాత్‌, రాజస్థాన్‌, ఛతీస్‌గడ్‌లో పార్టీ అధికారం కోల్పోయింది. ఈ టైమ్‌లో గుజరాత్‌లో 20, రాజస్థాన్‌లో 15 సీట్లు వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకోవడం కాస్త అత్యాశే.
అలాగే కర్నాటకలోనూ కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని, దక్షిణాదిపై పట్టు సాధిస్తామని బీజేపీ కన్న కల‌లు రివర్స్‌ అయ్యాయి. ఇప్పుడు అక్కడ జేడీఎస్ + కాంగ్రెస్‌ కూటమి కలిసి పోటీ చేస్తుండడంతో బీజేపీ 12-15 సీట్లకు మాత్రమే పరిమితం కానుంది. ఇక ఒడిశాలో 8, పశ్చిమ బెంగాల్లో 5, అస్సాం, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘ‌డ్‌, హర్యానాల్లో 5 సీట్లు, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూ క‌శ్మీర్‌, ఢిల్లీలో 2 సీట్లు, ఉత్తరాఖాండ్‌లో 3 సీట్లు, ఇతర రాష్ట్రాల్లో మరో 10 సీట్లు ఓవర్‌ ఆల్‌గా చూస్తే బీజేపీ ఫిగర్‌ 160 దాటే పరిస్థితి లేదు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులతో పోలిస్తే కాస్త ఎక్కువ వేసుకుంటేనే బీజేపీ ఫిగర్‌ 160 దాటే పరిస్థితి లేదని తేలింది. ఈ లెక్కన‌ ఆ పార్టీ మిత్ర పక్షాలతో కలిసి అధికారంలోకి రావాలన్నా మరో 125 సీట్ల వరకు అవసరమయ్యే పరిస్థితి ఉంది. బీజేపీతో స్నేహం చేసేందుకు చాలా ప్రాంతీయ పార్టీలు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. ఏదేమైనా తాజాగా కమలం పార్టీ చేయించుకున్న సర్వే కమల నాధులను కలవరపెడుతున్న మాట వాస్తవం.

Related Posts