YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హాలీడే మూడ్ లో జగన్

 హాలీడే మూడ్ లో జగన్
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా జరిగిన ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు ఈవీఎంలలోకి చేరింది. ఫలితాలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. ఇక, ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెస్ట్ తీసుకోనున్నారు. రెండేళ్లుగా పాదయాత్ర, ఎన్నికల ప్రచారంతో జగన్ ప్రజల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయన తీరిక లేకుండా గడిపారు. ఎన్నికల తర్వాత కూడా ఐదు రోజుల పాటు జిల్లాల్లో పోలింగ్ సరళిపై ఆయన పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. ఇక, ఇప్పుడు విజయంపై ధీమాగా ఉన్న జగన్ హాలీడేకు వెళ్లనున్నారు. నెల పాటు ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకోనున్నారు.ఎన్నికల్లోనే కాకుండా ప్రచారంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పోటీ పడ్డారు. మొదటి విడతలో ఎన్నికలు జరగడం, ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత ఆందోళనగా కనిపిస్తున్నారు. ఎన్నికల రోజు ఓటు వేసినప్పటి నుంచే ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికల నిర్వాహణలో ఈసీ వైఫల్యం చెందిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి సైతం ఆయన ఇదే విషయమై వివిధ పార్టీల నేతలను కలిసి గళం విప్పుతున్నారు. ఇక, ఆయన కర్ణాటక, తమిళనాడులో ప్రచారం కూడా చేపడుతున్నారు. తనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి వచ్చిన వారి తరపున ఇప్పుడు ఆయన వారి రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోనూ చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు బిజీగానే గడుపుతుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం పూర్తిగా హాలీడే మూడ్ లోకి వెళుతున్నారు. నాలుగు రోజుల పాటు పోలింగ్ సరళిపై సమీక్షలు జరిపిన జగన్ కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాకు వచ్చారు. వైసీపీ శ్రేణులపై టీడీపీ జరిపిన దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఆయన ఇక నెల పాటు పార్టీ వ్యవహారాలకు, మీడియాకు సైతం దూరంగా ఉండనున్నారు. జాతీయ రాజకీయాలపై కూడా జగన్ పట్టనట్లుగా ఉన్నారు. తనకు కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా సంబంధం లేదని, ఎన్నికల ముందునుంచే తాము ఎవరితోనూ కలవమని జగన్ స్పష్టంగా చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించిన వారికే వైసీపీ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలనూ ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. నెల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాల నాటికి ఆయన మళ్లీ యాక్టీవ్ కానున్నారు.

Related Posts