YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఈవీఎం ఆయుధం కలిసొస్తుందా

 ఈవీఎం ఆయుధం కలిసొస్తుందా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తమ ఓటు తాము ఎంచుకున్న పార్టీకే పడిందా? లేకపోతే ఎవరో ప్రోగ్రామింగ్ చేసిన పార్టీకి పడిందా? ఈ అనుమానం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. అటువంటి సందేహమే తలెత్తితే డెమొక్రసీ గంగలోకలిసిపోతుంది. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న నమ్మకం వమ్ము అయిపోతుంది. బహుముఖ పోటీల్లో నూటికి 30 మంది ఓటేస్తే చాలు అధికారంలోకి వచ్చేస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు అదనంగా తెచ్చుకున్నప్పటికీ ప్రజాప్రతినిధిగా ఎంపికైపోతున్నారు. కనీసం సగం మంది ప్రజలు ఎన్నుకోవడమనే నిబంధన మన ప్రజాప్రాతినిధ్య చట్టంలోనే లేదు. మన రాజ్యాంగంలో అందుకు వీలు కల్పించలేదు. దాంతో సర్దుబాటు ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. ఈవీఎంలను టాంపర్ చేసి ఆ మాత్రం సమ్మతినీ తప్పుదారి పట్టించవచ్చంటే భయాందోళనలు నెలకొనడం సహజం. గడచిన మూడు రోజులుగా ఢిల్లీకేంద్రంగా సాగుతున్న రాజకీయ రగడ ఓటర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఈవీఎం లను టాంపర్ చేయవచ్చని, ప్రజాతీర్పును వమ్ము చేయవచ్చని టీడీపీ నాయకత్వం గళమెత్తుతోంది. విపక్షాలను కూడగట్టి ఎన్నికల కమిషన్ పై దాదాపు యుద్ధమే చేస్తోంది. దీనికి సమర్థమైన సమాధానం చెప్పలేక భారత ఎన్నికల సంఘం సతమతమవుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా టీడీపీ డిమాండుకు విపక్షాల మద్దతు పెరుగుతోంది..చంద్రబాబు నాయుడు చాలా చాకచక్యంగా ఈవీఎం అంశాన్ని ఎన్నికల ఆయుధంగా మార్చారు. రాఫెల్ అవినీతి, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, వ్యవస్థలను నాశనం చేయడం, మతపరమైన విభజన వంటివి ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానాస్త్రాలుగా ఉన్నాయి. ఇప్పుడు వాటికి ఈవీఎం కూడా చేరింది. తొలివిడత ఎన్నికలో తమ రాష్ట్రంలో ఈవీఎం లోపాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో మిగిలిన పక్షాల్లో సైతం ఆయన భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే ఆయనతో కలిసి 22 రాజకీయపార్టీలు ఈవీఎంలతోపాటు 50శాతం వీవీ పాట్లను లెక్కించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం మధ్యేమార్గంగా నియోజకవర్గానికి అయిదు పోలింగు బూతుల్లోని వీవీపాట్లు లెక్కిస్తే సరిపోతుందని తీర్పు చెప్పింది. విపక్షాలకు ఇదే మాత్రం సంతృప్తికరంగా కనిపించలేదు. దీంతో విషయాన్ని ప్రజాకోర్టులోకి తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ ఈవీఎం లలో లోపాలను అనుమతిస్తోందని, ట్యాంపరింగుకు అవకాశం కల్పిస్తోందన్న భావనను ప్రజల్లో వ్యాపింప చేయడమే విపక్షాల లక్ష్యం. దీనివల్ల ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత దెబ్బతినడమే కాకుండా ప్రజాస్వామ్యంపైనే ప్రజలకు నమ్మకం పోతుంది. పర్యవసానాలను పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు ఈ దుస్సాహసానికి తెగిస్తున్నాయనే చెప్పవచ్చు. బీజేపీని డిఫెన్సులోకి నెట్టివేయడమనే టార్గెట్ తో చేస్తున్న ఈ ప్రయత్నం వికటించేందుకే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీజేపీ, పార్టీలు శాశ్వతం కాదు. వ్యవస్థలు శాశ్వతం అన్న సత్యాన్ని పార్టీలు గ్రహించాలి.తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల మాదిరిగానే ఈవీఎం ల విషయంలోనూ పార్టీలు చీలిపోయాయి. టీఆర్ఎస్, వైసీపీలు ఈవీఎంలను సంపూర్ణంగా సమర్థిస్తున్నాయి. నిజానికి టీడీపీ ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తూ ఎన్నికల కమిషన్ పై ఆందోళన చేస్తోంది. దానికి బదులివ్వాల్సిన బాధ్యత ఈసీదే. కానీ మధ్యలో టీఆర్ఎస్ జోక్యం చేసుకుంటోంది. ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ కూడా ఈసీని వెనకేసుకొచ్చే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోంది. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సింది కమిషన్ మాత్రమే. పార్టీలకు ఏమాత్రం సంబంధం లేదు. వైసీపీ, టీఆర్ఎస్ ల మద్దతు భారత ఎన్నికల సంఘానికి అవసరం లేదు. అనుచితమైన మద్దతు ఇవ్వడం ద్వారా కమిషన్ పై మచ్చ పడేందుకు టీఆర్ఎస్, వైసీపీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. అవునన్నా, కాదన్నా ఈవీఎం రాజకీయాస్త్రంగా మారిపోయింది. ప్రత్యర్థులపై విసిరేందుకు అది కూడా ప్రచార ముడిసరుకే. స్వతంత్ర వ్యవస్థగా నిర్ణయాలు తీసుకోవాల్సిన కమిషన్ కొన్ని సందర్బాల్లో కేంద్రం వద్ద మార్కులు కొట్టేద్దామని కనబరిచిన అత్యుత్సాహమే ఇప్పుడు కొంపలు ముంచుతోంది. శేషన్ వంటి సిన్సియర్ ఆఫీసర్లను నియమించి తనపర భేదం లేకుండా అన్నిపార్టీలపైనా కొరడా ఝళిపిస్తే తప్ప కోల్పోయిన పరపతి తిరిగి పొందడం సాధ్యం కాదు. ఇందుకు కేంద్రం వెంటనే చొరవ చూపాలి. లేకపోతే రాజకీయ కార్యనిర్వాహక వర్గం సంగతి పక్కనపెడితే మొత్తం ప్రజాస్వామ్యమే నవ్వులపాలవుతుంది.రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కటవుతున్న పార్టీలు ఎన్నికల కమిషన్ కు విషమపరీక్ష పెడుతున్నాయి. బీజేపీని రోడ్డున నిలపాలనే లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ప్రతిష్ఠను పార్టీలు దెబ్బతీస్తున్నాయి. ఇంతవరకూ ఈవీఎంలు ట్యాంపరింగుకు గురైనట్లు సాక్ష్యాలు లేవు. ఆధారాలు లేవు. అయితే అందుకు అవకాశముందనే అనుమానాలు మాత్రమే ఉన్నాయి. దీనిని ప్రాతిపదికగా చేసుకుంటూ పార్టీలు రచ్చ చేస్తున్నాయి. 50శాతం వీవీపాట్లు లెక్కించేందుకు కమిషన్ అంగీకరించడం లేదు. అందువల్ల ఈ సార్వత్రికం తర్వాత భవిష్యత్తులో ఎన్నికలు పేపర్ బ్యాలెట్ పై నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టవచ్చు. అందుకు అనుగుణంగా అవసరమైతే ఆందోళనతో ప్రజాభిప్రాయాన్ని మలచవచ్చు. న్యాయస్థానం ద్వారా కూడా పోరాటం చేయవచ్చు. ఈలోపు రాజ్యాంగవ్యవస్థ అయిన కమిషన్ పవిత్రతను, ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత రాజకీయపార్టీలపై ఉంది. లేకపోతే రేపొద్దున్న ఏపార్టీ అధికారంలోకి వచ్చినా ఇతర పక్షాలు అనుమానాస్పదంగా చూసే అవకాశం ఉంది. ఎన్నికల కు మూల సూత్రమైన స్వేచ్ఛ, పారదర్శకత, సమానావకాశాలన్న నిబంధనలు అపహాస్యం పాలవుతాయి. సంయమనం పాటించకుండా రాజకీయాస్త్రంగా పనికొస్తుంది కదా? అని తాత్కాలిక ప్రయోజనాలకోసం వెంపర్లాడితే మొదటికే మోసం వస్తుంది. దాని ప్రభావాన్ని దేశమే చవిచూడాల్సి వస్తుంది. ఒకసారి పడిపోయిన ప్రతిష్ఠను పునరుద్ధరించడం చాలా కష్టం. దీనిని అన్నిపార్టీలు దృష్టిలో పెట్టుకోవాలి.

Related Posts