యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో నోట్ల కట్టలు తెగాయి. ఓటర్లకు నోట్ల పండగే అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగానే భారీ ఎత్తున కోట్లాది రూపాయిలు ఖర్చు అయిన నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, గురజాల, పెదకూరపాడు లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో గతంలో ఓటుకు రూ. 200 నుంచి 300 పంచడమే గగనంగా ఉండేది. అలాంటి చోట్ల ఇప్పుడు ఓటుకు 1000 వరకు పంచారు. ఇక కీలక నేతలు, ఆర్థికంగా బలవంతులు పోటీ పడిన నియోజకవర్గాల్లో డబ్బుల పంపిణీకి లెక్కే లేకుండా పోయింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల తంతు ముగిసే వరకు రూ. 175 కోట్లు ఖర్చు చేసినట్టు జిల్లాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన కొమ్మాలపాటి శ్రీధర్, వైసీపీ నుంచి పోటీ చేసిన నంబూరి శంకర్‌రావు ఇద్దరూ రియల్టర్లే కావడంతోఎవరికి వారు గెలుపును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఓటర్లపై కోట్లు కుమ్మరించారు. ఇప్పటికే గత రెండు ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తున్న కొమ్మాలపాటిని ఓడించేందుకు జగన్ నంబూరి శంకర్‌రావును రంగంలోకి దించారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల శ్రీధర్‌కు శంకర్‌రావు అయితేనే బలమైన అభ్యర్థి అవుతారని జగన్ చేయించిన పలు సర్వేల్లో స్పష్టం కావడంతో శంకర్‌రావుకే వైసీపీ సీటు ఖరారు అయ్యింది. గతంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కావటి మనోహర్ నాయుడుని తప్పించి మరీ శంకర్‌రావును తెర మీదకు తీసుకువచ్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి శ్రీధర్‌కు ఢీ అంటే ఢీ అనే రీతిలో పోటీ ఇచ్చిన శంకర్‌రావు ఎన్నికల వేళ శ్రీధర్‌కు ముచ్చెమటలు పట్టించారు. శ్రీధర్ ఓట్ల కొనుగోలుకే 60 నుంచి 65 కోట్లు ఖర్చు చెయ్యగా శంకర్‌రావు 75 కోట్లు వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.ఇద్దరు అభ్యర్థులు కేవలం ఓట్ల కొనుగోలుకే 130 నుంచి 135 కోట్ల వరకు ఖర్చు చెయ్యగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన గత ఆరు నెలల నుంచి కలుపుకుంటే వీరు ఖర్చు మరో 40 కోట్ల వరకు ఉంటుందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే గత ఆరు నెలల నుంచి పెదకూరపాడులో రెండు పార్టీల కేడర్‌కు పండగే పండగ. శంకర్‌రావు విపరీతంగా డబ్బులు వెదజల్లడంతో శ్రీధర్ సైతం కాస్త అటు ఇటుగా డబ్బులు బయటకు తియ్యక తప్పని పరిస్థితి. నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ మండలాలు వైసీపీకి, పెదకూరపాడు, అమరావతి మండలాలు టీడీపీకి ఆధిక్యం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.ఇక గెలుపు ఓటములపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. టీడీపీ తాము 4 నుంచి 5 వేల ఓట్ల మెజారిటీతో బయట పడతామని లెక్కలు వేస్తుంటే వైసీపీ సైతం అదే అంచనాల్లో ఉంది. అమరావతి, పెదకూరపాడు మండలాల నుంచి ఐదారు వేల మెజారిటీ వస్తుందని టీడీపీ భావిస్తుంటే అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు నుంచి తమకు మంచి మెజారిటీ వస్తుందని వైసీపీ భావిస్తోంది. ఏదేమైనా రూ. 175 కోట్లు ఖర్చు పెట్టిన నియోజకవర్గంగా రికార్డులకు ఎక్కిన పెదకూరపాడు మహాసంగ్రామంలో గెలుపు శ్రీధర్‌దా ? శంకర్‌రావుదా ? అన్న దానిపై రాజకీయ మేథావులు సైతం ఓ అంచనాకి రాలేకపోతున్నారు. మరి తుది ఫలితంలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.