యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంత ధీమా ఎందుకు కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తున్నామన్న విశ్వాసాన్ని కిందిస్థాయినుంచి పై స్థాయి నేతల వరకూ ఎందుకు వ్యక్తం చేస్తున్నారు. తమదే గెలుపు అన్న వారి లెక్కేంటి? ఇదీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పించిందంటున్నారు వైసీపీ నేతలు. ప్రతి నియోజకవర్గం నుంచి బూత్ ల వారీగా నివేదికలను పార్టీ అధిష్టానం తెప్పించుకుంది. చివరి నిమిషంలో పోలయిన ఓట్లు కూడా తమకు అనుకూలంగానే పడ్డాయంటున్నారు. అంతేకాదు మహిళా ఓటర్లు కూడా తమకే మద్దతు పలికారని కిందిస్థాయి నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా చెబుతున్నామని వైసీపీకి చెందిన ఒక సీనియర్ నేత చెప్పారు.మే 23వ తేదీన కౌంటింగ్. ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం మే 23వ తేదీ తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఘంటాపథంగా చెబుతున్నారు.గత ఎన్నికల్లో తమను దెబ్బతీసిన ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా వైసీపీకి అనుకూల పవనాలు వీచినట్లు కిందిస్థాయి క్యాడర్ అందించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నేతలందరూ సమన్వయంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యపడిందన్న అభిప్రాయం వైసీపీ అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది. అయితే అందిన సమాచారం ప్రకారం విజయవాడ, విశాఖపట్నం వంటి అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందని కూడా ఆఫ్ ది రికార్డుగా నేతలు అంగీకరిస్తున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలుండగా అందులో ఈసారి 25 స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కేవలం ఎనిమిది స్థానాలకే వైసీపీ పరిమితమయింది. మే 23వ తేదీన ఉత్తరాంధ్ర ఫలితాలు అందరినీ ఆశ్చర్యపర్చేవిధంగా ఉంటాయని ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత ఒకరు అనడం గమనార్హం. ఇక్కడ ప్రధానంగా జగన్ పాదయాత్ర, నవరత్నాలు, బాక్సైట్ గనుల తవ్వకం రద్దు వంటి హామీలు బాగా పనిచేశాయని కిందిస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అలాగే గత ఎన్నికల్లో జీరోకే పరిమితమైన పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఈసారి ఖచ్చితంగా ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు వస్తాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలున్నాయి. ఇక 19 అసెంబ్లీ స్థానాలున్న తూర్పు గోదావరి జిల్లాలో సయితం పన్నెండు నుంచి పధ్నాలుగు స్థానాలపై ఫ్యాన్ పార్టీ నేతలు ఆశలుపెట్టుకున్నారు.ఇక రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి వచ్చిన నివేదికల ప్రకారం వైసీపీ తొమ్మిది నుంచి పది స్థానాల్లో జెండా ఎగుర వేయబోతున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో అనంతపురంలో కేవలం రెండు సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయి. అలాగే చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లోనూ వైసీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందన్న అంచనాలో వైసీపీ నేతలు ఉన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఖచ్చితంగా 120 నుంచి 130 స్థానాలు దక్కబోతున్నట్లు ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్ల పార్టీకి నష్టం జరగలేదని, జరిగిన నష్టం టీడీపీకేనన్నది వైసీపీ నేతల అభిప్రాయం. మరి ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓటరు తీర్పు తేలాలంటే మే 23వ తేదీ వరకూ ఆగాల్సిందే.