యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పరిచయం అవసరంలేని పేరు ముకేశ్ అంబానీ. దేశంలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోని టాప్-10 కుబేరుల్లో ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. రిలయన్స్ జియో సారధి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది అత్యంత ప్రభావశీలురతో ‘‘టైమ్’’ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో మన దేశం తరఫున ఎంపికైన ఏకైక భారతీయ పారిశ్రామికవేత్త ఈయన. అలాంటిది ఈయన ఏ పార్టీకి మద్దతిస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికే ఉంటుంది. ముకేశ్ అంబానీ కాంగ్రెస్ నేత మిలింద్ మురళీ దేవరాకు మద్దతు ప్రకటించారు. ఈయన ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ముకేశ్ అంబానీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటారేమో.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీపై రఫెల్ డీల్‌కు సంబంధించి తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం అందరికీ తెలుసు. అనిల్ అంబానీకి డబ్బులు మిగిల్చేందుకే ప్రధాని మోదీ రఫేల్ విమానాలకు అధిక ధర చెల్లిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. అనిల్ అంబానీకి ప్రధాని నరేంద్ర మోదీ మధ్యవర్తిగా వ్యవహరించారని, దేశ రక్షణ వ్యవహారాల్లో రహస్యంగా ఉంచాల్సిన సున్నితమైన అంశాలను రాజీపడి ఇతరులకు చేరవేశారని, దీనికి మోదీ శిక్ష అనుభవించాల్సిందేనని రాహుల్ ఇదివరకే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అన్న ముకేశ్ అంబానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం గమనార్హం. మరోవైపు ఇటీవలే ముకేశ్ అంబానీ.. తమ్ముడు అనిల్ అంబానీకి రూ.400 కోట్లు ఇచ్చి ఎరిక్‌సన్ కేసులో జైలుకు వెళ్లకుండా రక్షించారు. ‘మిలింద్ సౌత్ ముంబైకి చెందిన వ్యక్తి. ఈయనకు ఈ ప్రాంతపు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై పరిపూర్ణమైన అవగాహన ఉంది’ అని ముకేశ్ అంబానీ ఒక వీడియోలో చెప్పారు. ఈ వీడియోను మిలింద్ మురళీ దేవర తన ట్విటర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ వీడియోను చూస్తే స్థానికంగా అన్ని వర్గాల నుంచి మిలింద్ మురళీ దేవరాకు ఎలాంటి మద్దతు లభిస్తుందో అర్థమౌతుంది. చిరు వ్యాపారులు మొదలు బడా కార్పొరేట్ల దాకా చాలా మంది ఈయనకు మద్దతునిస్తున్నారు. వీరిలో ముఖేష్ అంబానీతోపాటు ఉదయ్ కొటక్ లాంటి కార్పొరేటర్లు కూడా ఉండటం విశేషం. ఇకపోతే సౌత్ ముంబైలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి