యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరుసాగిందన్నది పోలింగ్ ట్రెండ్స్ ను బట్టి తెలుస్తున్నాయి. అనేక నియోజకవర్గాల్లో మెజారిటీ సయితం అత్యల్పంగా ఈసారి నమోదవుతుందని రెండు పార్టీలూ ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నాయి. ఒక ప్రధాన దినపత్రిక సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి 95 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినట్లు పార్టీ నేతలకు చెప్పిందట. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తమకు 95 నుంచి 100 స్థానాల వరకూ వస్తాయని ఉండవల్లి నారా చంద్రబాబునాయుడి అతిధి గృహానికి వచ్చిన టీడీపీ నేతలు చెబుతున్నారు.ప్రధానంగా మధ్యాహ్నం తర్వాత జరిగిన పోలింగ్ తమకు అనుకూలమని టీడీపీ ధీమాగా ఉంది. ముఖ్యంగా పసుపు కుంకుమ, పింఛనుదారులు తమకు అండగా నిలిచారని తమదే గెలుపు ఖాయమని టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు వాయిస్ ఆఫ్ పార్టీగాఉన్న నేతలు మాత్రం ఇప్పుడు నోరు మెదపక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు లాంటి వాళ్లు నోరు విప్పడం లేదు. తమ నియోజకవర్గాల్లో పరిస్థితులను అంచనా వేసుకునే పనిలోనే వారున్నారు.ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే 120 స్థానాలకు తగ్గవని తొలినుంచి చెబుతున్నారు. ఏ జిల్లాలో చూసినా తమకే ఎడ్జ్ ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. అనంతపురం లాంటి జిల్లాల్లో గతం కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని, ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సయితం తమకే అత్యధిక స్థానాలు వస్తాయని గట్టిగా చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో సయితం ఎనిమిది స్థానాల వరకూ గెలుచుకుంటామన్న విశ్వాసంలో వైసీపీ శ్రేణులున్నాయి.అయితే ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల్లో అత్యధిక శాతం మంది వైసీపీ గెలుస్తుందన్న అంచనాల్లో ఉన్నారు. చంద్రబాబును విశ్వసించే పది మంది ఐఏఎస్ అధికారులు మాత్రం టీడీపీ తిరిగి 95 స్థానాలను దక్కించుకుని అధికారంలో వస్తుందని లెక్కలు చెబుతున్నారట. మిగిలిన అధికారుల్లో ఎక్కువ మంది వైసీపీకే అవకాశమని చెబుతుండటం విశేషం. కొందరు ఐఏఎస్ అధికారులు వైసీపీ వస్తుందని, మంచి పోస్టింగ్ లకు కూడా ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారట. ముఖ్యంగా గతంలో మంత్రులు పంపిన ఇంపార్టెంట్ ఫైళ్లను కూడా తొక్కేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాతనే ఫైళ్లు చూద్దామన్న ధోరణిలో ఐఏఎస్ అధికారులున్నారట. మొత్తం మీద ఐఏఎస్ లు కూడా బహిరంగంగా కాకపోయినా తమకు అత్యంత సన్నిహితులైన మీడియా మిత్రుల వద్ద మాత్రం వైసీపీకే అవకాశాలున్నాయని చెబుతుండటం విశేషం.