యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖలో సాగిన రాజకీయం ఓ లెక్కలో ఉంది. ఇక్కడ నుంచి ఎన్నికల వేళ సినీ సెలిబ్రిటీ, జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీకి దిగారు. అంతేనా అనంతపురం కదిరి శాశ్వత చిరునామా కలిగిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ చలో విశాఖ అన్నారు. మరి విశాఖ ఎవరిని ఆదరించింది. ఎంతవరకు ఆదరించింది అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది.పవన్ గాజువాకలో పోటీకి నామినేషన్ వేసినపుడు ఆయన గెలుపు ఖాయం అనుకున్నారంతా. ఆ తరువాత ఏమైందో ఏమో పవర్ స్టార్ అక్కడ పెద్దగా ప్రచారం చేయలేదు. మూడు సార్లు మాత్రమే వచ్చారు. మొత్తం గాజువాకలో పర్యటించలేదన్న బాధ జనానిదే కాదు, అభిమానులది కూడా. ఇక పవన్ పార్టీకి నిర్మాణం పెద్దగా లేదు. జనంలో నిలబడి ఊపు తేవాల్సిన జనసేనాని సరిగా రాకపోవడం పెద్ద తప్పిదమేనని అంటున్నారు. ఇక లోకల్, నాన్ లోకల్ అన్న ప్రశ్న తలెత్తినపుడు దాన్ని జనంలో ఉంచి అటు టీడీపీ, ఇటు వైసీపీ బలపడేందుకు ప్రయత్నం చేశాయి.ఇక వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి ఒక అడుగు ముందుకేసి తనకు చివరి సారి అవకాశం ఇవాలని కోరారు. ఆ సానుభూతి మంత్రానికి తోడు గాజువాకలో జగన్ చేసిన ప్రచారం మంచి వూపు తెచ్చింది. ఇక పవన్ అభిమానులు కూడా వేగంగా సంభవించిన ఈ పరిణామాలపై కలవరపడి తమ వంతుగా అధినేతను గెలిపించేందుకు గట్టిగా ప్రయత్నించారు. యధా శక్తి తమ వంతుగా పార్టీకి వూపు తెచ్చారు. ఐతే ఇది గెలిచేందుకు సరిపోతుందా అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నలా ఉంది.ఇక విశాఖ ఎంపీగా పోటీ చేసిన జనసేన అభ్యర్ధి వీవీ లక్ష్మీ నారాయణ తక్కువ టైంలోనే మంచి ఊపు తెచ్చారని టాక్ నడుతోంది. ఆయన తన సొంత ఇమేజ్ మీదనే ఆధరపడి ఈ ఎన్నికల్లో పోటీ చేశారనుకోవాలి. ఆయన జేడీగా పనిచేసిన తీరు, ఆయన నిబద్ధత వంటివి ఉపయోగపడ్డాయని అంటున్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున ఓట్లు ఆయనకు పడ్డాయని చెబుతున్నారు. మొత్తానికి చూసుకుంటే పవన్ పోటీ చేసిన గాజువాకలో పవన్ కంటే కూడా జేడీకే ఎక్కువ ఓట్లు వస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే అసలైన హీరోగా జేడీ నే జనంలో ఉంటారనండమో సందేహం లేదు.