యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సమాజంలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో ఓట్లు అమ్ముకోవడంపై ఎన్నికల ప్రచారం లో బాగానే లెక్చర్లు దంచారు. వైసీపీ, టీడీపీ నేతలు ఓటుకు రెండు వేలు.. ఒకరు, ఓటుకు పదివేలు పసుపు కుంకుమ పేరుతో మరొకరు పంచుతున్నారని, ఇంత కుళ్లిపోయిన రాజకీయాలు తాను ఎక్కడా చూడలేదని జనసేనాని అనేక సభల్లో ఉటంకించారు. చీదరించుకు న్నారు. అంతేకాదు, డబ్బుతీసుకుని మీరు ఓటేస్తే.. రేపు ఆ నాయకుడు మిమ్మల్ని పట్టించుకోకపోతే.. ఏమని ప్రశ్నిస్తారు? అంటూ ప్రజలను నిలదీసిన సభలు కూడా మనకు కనిపించాయి. దీంతో జనసేన ఈ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదని అందరూ భావించారు. పైగా తన దగ్గర డబ్బులేదని పేదవాడినని, ఓ కానిస్టేబుల్ కుమారుడిగా మాత్రమే తనకు గుర్తింపు ఉందని, ఇదే రాజకీయాలకు మార్పు కావాలని పెద్ద ఎత్తున ప్రసంగాలను దంచి కొట్టారు.దీంతో రాజకీయాలకు తటస్థంగా ఉండే మేదావులు, ఓ వర్గం ప్రజలు కూడా ప్రస్తుత ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఖర్చు చేసి.. ప్రతి రూపాయికీ లెక్కలు చూపిస్తుందని, పారదర్శకంగా పవన్ పార్టీ దూసుకుపోతుందని అందరూ భావించారు. ఇక, ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు తాజా ఎన్నికల్లో జనసేన తరఫున పోటీకి దిగిన అభ్యర్థులు చేసిన ఖర్చుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎక్కడికక్కడ నాయకులు చేసిన ఖర్చు, వారిని బలపరిచిన నాయకులు చేసిన ఖర్చు బయటకు వస్తోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ చిన్న అన్న.. నటుడు, నిర్మాత, జబర్దస్త్ నాగబాబు పోటీ చేసిన నరసాపురంలో ఎంత ఖర్చు చేశారనే విషయం ఆసక్తిగా మారింది.ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం బలం ఎక్కువ (ఓటర్ల పరంగా కాపులు చాలా ఎక్కువుగా ఉన్నా కొన్నేళ్ల నుంచి క్షత్రియులే ఇక్కడ ఎక్కువుగా ఎంపీలుగా గెలుస్తున్నారు). పైగా ఇక్కడ నుంచి గెలుస్తున్న ఎంపీ అభ్యర్థులు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక.. తాజా ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన నాయకులు కూడా క్షత్రియ నియోజకవర్గానికి చెందిన వారే. దీంతో ఒక కాపు వర్గానికి చెందిన నాయకుడిగా నాగబాబును గెలిపించుకోవడం జనసేన శ్రేణులకు సవాలుగా మారింది. దీంతో ఇక్కడ డబ్బుకు పనిచెప్పారనే విషయం తాజాగా వెలుగు చూసింది. జనసేన అభ్యర్థుల ఖర్చు రూ. 50 కోట్లు దాటిందని అంచనా. నాగబాబును గెలిపించుకోవాలనే లక్ష్యంతో భీమవరంలో పవన్ అభిమానులు రూ. 25 కోట్ల వరకు ఖర్చు చేశారు. పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెంలోనూ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన జనసేన అభ్యర్థులు కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు.పాలకొల్లు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగిన గుణ్నం నాగబాబు దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. అదేవిధంగా నరసాపురం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన బొమ్మిడి నాయకర్, తాడేపల్లి గూడెం నుంచి బరిలో నిలిచిన బోలిశెట్టి శ్రీనివాస్ కూడా బారీగానే ఖర్చు చేశారని అంటున్నారు. మొత్తానికి ఎంత లేదన్నా 50 కోట్ల పైమాటే నాగబాబు కోసం వీరంతా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబు ఏమేరకు విజయం సాధిస్తారో చూడాలంటే.. మే 23 వరకు వెయిట్ చేయకతప్పదు!