యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన సొంతంగా పోటీచేసిందే 65 స్థానాల్లో. అలాంటిది 88 స్థానాల్లో ఎలా గెలుస్తుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. జనసేన నాయకుడు జేడీ లక్ష్మీనారాయణ తమ పార్టీ 88 స్థానాల్లో గెలుస్తుందన్న వ్యాఖ్యలపై శుక్రవారం విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
కర్ణాటక ఎలక్షన్ ప్రచారంలో రూపాయి విలువ పడిపోయిందని, పర్యావరణ పరిరక్షణలో వెనకబడిందని, దేశంలో అసమానతలు అలాగే ఉన్నాయని చంద్రబాబు సొల్లు వాగాడని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. పాకిస్తాన్ వాళ్లు పిలిచినా ప్రచారం చేసొస్తాడని, ఐదేళ్లు ఏపీలో పంచభూతాలను హాం ఫట్ చేసిన వ్యక్తి సిగ్గులేకుండా దేశాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సుప్రీంకెళ్తే అసెంబ్లీ సెగ్మెంటుకు ఐదు కౌంట్ చేస్తే చాలని తీర్పు చెప్పిందని, అయినా వీవీప్యాట్లన్నిటిని లెక్కించాలని డిమాండు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ అనేది ఆయన ఒక్కడి కోసం జరిగేది కాదని, సుప్రీం ఆదేశాలను గౌరవించాలన్న సృహ కూడా లేదన్నారు.