మోదీ పేరున్న వారంతా దొంగలేనంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనను బ్రిటన్ కోర్టుకు లాగుతానని లలిత్ మోదీ హెచ్చరించారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీలను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని, ఇంకా ఎంత మంది ఇలాంటి మోదీలు బయటికొస్తారో మనకు తెలియదని మహారాష్ట్రలో ఇటీవల ఓ ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో తాను కోర్టును ఆశ్రయిస్తానని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. ఐదు దశాబ్ధాల పాటు భారత్‌ను రాహుల్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఎవరు దొంగో..ఎవరు కాపలాదారో మీరే తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్‌గా వ్యవహరించిన లలిత్ మోదీ తనపై మనీల్యాండరింగ్ ఆరోపణలు రావడంతో భారత్‌ను విడిచిపెట్టి వెళ్లారు.మోదీలందరూ దొంగలని చెబుతున్న రాహుల్ గాంధీపై బ్రిటన్ కోర్టులో తాను కేసు వేస్తానని లలిత్ మోదీ హెచ్చరించారు.మరోవైపు తనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు. మోదీల పేరున్న వారంతా దొంగలేనంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీసీలను అవమానించడమేనని దుయ్యబట్టారు.