YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ హెలికాఫ్టర్ లో ఏం తీసుకెళ్తున్నారు... కాంగ్రెస్ క్వశ్చన్

 మోడీ హెలికాఫ్టర్ లో ఏం తీసుకెళ్తున్నారు... కాంగ్రెస్ క్వశ్చన్
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిని విధులు నుంచి ఎన్నికల సంఘం తప్పించిన విషయం తెలిసిందే. అయితే, అధికారిపై ఈసీ చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రధాని వాహనం తనిఖీ విషయంలో ఈసీ నిబంధనల్లో ఎలాంటి మినహాయింపు లేదని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఎస్పీజీ భద్రత ఉన్న నేతల వాహనాల్ని తనిఖీ చేయడం ద్వారా ఒడిశాలో విధులు నిర్వర్తిస్తున్న కర్ణాటక క్యాడర్‌ అధికారి మొహమ్మద్‌ మొహసిన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ చర్య తీసుకోవడం ఈసీ వివక్షకు నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపించింది. తన విధులను సక్రమంగా నిర్వర్తించిన ఓ అధికారిని ఈసీ సస్పెండ్‌ చేసిందని దుయ్యబట్టింది. ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్న అధికారిక వాహనాల్ని తనిఖీ చేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయని, దీని ప్రకారం సోదాల నుంచి ప్రధాని వాహనానికి మినహాయింపేమీ లేదని కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ ఖాతాలో స్పష్టం చేసింది. అంతేకాదు, మోదీ తన హెలికాప్టర్‌లో ఏం తీసుకెళ్తున్నారనేది దేశం మొత్తానికి తెలియాల్సి ఉందని, దీనిపై ఈసీ సమాధానం చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ప్రధాని వినియోగిస్తోన్న హెలికాప్టర్‌‌లోని నల్ల పెట్టెను తరలించిన తర్వాత ప్రతి విమానాన్నీ ఈసీ తనిఖీ చేస్తుందని భావించాం, కానీ, ఓ అధికారిని సస్పెండ్‌ చేయడం ద్వారా పూర్తి వివక్ష ప్రదర్శించిందని విమర్శించింది. ‘ప్రస్తుత, మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుల వాహన శ్రేణిని తనిఖీ చేసేందుకు ఈసీ అనుమతించిన సందర్భాలున్నాయని ఆ పార్టీ గుర్తుచేసింది. ఎస్పీజీ భద్రత ఉన్న నేతలను వ్యక్తిగతంగా తనిఖీ చేయరాదు కానీ, ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిని ఎందుకు సస్పెండ్‌ చేశారు? దేశానికి ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు?’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. చౌకీదార్‌ ఏమైనా దాచడానికి యత్నిస్తున్నారా? మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. నిబంధనల ప్రకారం.. అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం, దీనికి సంబంధించి విషయాలకు వినియోగించిడం నిషేధం. దీనిపై గత సార్వత్రిక ఎన్నికల్లోనే ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది.

Related Posts