ఐపీఎల్ 2019 సీజన్‌లో క్రిస్‌గేల్, ఆండ్రీ రసెల్, ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్ తదితర హిట్టర్ల కంటే.. ఇప్పుడు అన్ని జట్లూ ముంబయి టీమ్ పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్యాని స్లాగ్ ఓవర్లలో నిలువరించడం ఎలా..? అని తలలు పట్టుకుంటున్నాయి. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌కి వస్తున్న హార్దిక్ పాండ్యా.. భారీ షాట్లు బాదేస్తూ స్కోరుని అమాంతం పెంచేస్తున్నాడు. బంతి ఏదైనా.. బౌలర్ ఎవరైనా.. అతని హిట్టింగ్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఢిల్లీతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ మిడిల్ ఓవర్లలో వికెట్లు చేజార్చుకున్న ముంబయి జట్టు 15.1 ఓవర్లు ముగిసే సమయానికి 104/4తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివరి 4 ఓవర్లలో ఉతికారేసిన హార్దిక్ పాండ్య (32: 15 బంతుల్లో 2x4, 3x6) ఆఖరికి ముంబయిని 168/5తో మెరుగైన స్థితిలో నిలిపాడు. బౌలింగ్‌లోనూ ఒక వికెట్ పడగొట్టి ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన హార్దిక్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
వాస్తవానికి ఐపీఎల్ 2019 సీజన్‌లో హార్దిక్ పాండ్యా భారీ స్కోర్లు ఏమీ నమోదు చేయలేదు. ఇప్పటికే 9 మ్యాచ్‌లాడిన ఈ పవర్ హిట్టర్ చేసింది 218 పరుగులే. కానీ.. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 ఫోర్లు, 16 సిక్సర్లు ఉండటం బాదుడుకి నిదర్శనం. చివరి నాలుగు ఐపీఎల్ సీజన్లలో పోలిస్తే.. అతని తాజా సగటు 43.60, స్ట్రైక్‌రేట్ 194.64 అధికంగా ఉండటం కొసమెరుపు. ఫాస్ట్ బౌలరైనా.. స్పిన్నరైనా.. బంతి విసరక ముందే ఆఫ్ స్టంప్ లైన్‌పై నిల్చొనే హార్దిక్ పాండ్య.. ధోనీ తరహాలో హెలికాప్టర్ సిక్సర్లు కూడా బాదేస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క హెలికాప్టర్ షాట్ అయినా.. అతని ఇన్నింగ్స్‌లో ఉంటోంది. ఎంతలా అంటే..? చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ముందే.. అతను హెలికాప్టర్ షాట్‌తో బంతిని వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్‌లోకి తరలించేయడం విశేషం..!