కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చడానికి పని చేయాల్సిన నగర పాలక సంస్థ, నీటి పారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రజల కష్టాలు రెట్టింపు కానున్నాయి. కర్నూలు నగర ప్రజల దాహార్తి తీరాలంటే ప్రతి రోజూ 70మిలియన్ లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో వ్యక్తికి రోజుకు 160 లీటర్ల నీరు సరఫరా చేయాలని నిబంధన ఉన్నా ప్రస్తుతం 120 లీటర్ల నీరు అందుతోంది. ఇది కూడా సక్రమంగా సరఫరా కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా సుమారు 5.5 లక్షలు. రోజురోజుకూ శివారు కాలనీల్లో జనాభా పెరుగుతున్నా అక్కడ నగర పాలక సంస్థ నుంచి నీరు సరఫరా కావడం లేదు. వారు సొంతంగా బోర్లు వేసుకుని ఇంటి అవసరాలకు వినియోగించుకుంటూ తాగునీటి కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. నగర ప్రజల దాహార్తి తీర్చడానికి మునగాలపాడు వద్ద నిర్మించిన సమ్మర్ స్టోరేజీ నీటి నిల్వ సామర్థ్యం 0.155 టిఎంసిలు కాగా ప్రస్తుతం 0.05టిఎంసిలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. తుంగభద్ర జలాశయం నుంచి సుంకేసుల జలాశయంలో నగర నీటి అవసరాల కోసం నిల్వ ఉంచాల్సిన 0.5 టిఎంసిల నీరు జనవరిలో కెసి కాలువకు పంట పొలాల అవసరాలకు విడుదల చేయడంతో నగర ప్రజల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని నగర పాలక సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గాజులదినె్న ప్రాజెక్టు నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు నీటిని తరలిస్తున్నారు. జిడిపిలో 0.56 టిఎంసిల నీరు నిల్వ ఉందని ఇవి జూన్ 15వ తేదీ వరకూ వినియోగించుకోవచ్చని నగర పాలక సంస్థ అధికారులు పేర్కొంటుండగా జిడిపి కింద ఉన్న పంటలు, సమీప గ్రామీణ ప్రాంతాల తాగునీటి అవసరాలకు పోనూ నగర ప్రజలకు 0.2 టిఎంసిల నీరు మాత్రమే ఇవ్వగలమని పేర్కొంటున్నారు. జిడిపి నుంచి ప్రస్తుతం వస్తున్న నీరు ఆవిరి, సరఫరా నష్టాలు పోనూ 0.5 టిఎంసిలను ఖచ్చితంగా వినియోగించుకుంటామని, ఇందుకు ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు వస్తాయని నగర పాలక సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. అయినా ఈ నీరు మే 3వ వారం వరకూ సరిపోతాయని సాగునీటి అధికారులు అంచనా వేస్తున్నారు. జిడిపి నీటిపై పూర్తిస్థాయిలో ఆధారపడకుండా నీటి సరఫరా కోసం నగరంలో నీరు పుష్కలంగా ఉన్న బోర్లను స్వాధీనం చేసుకుని నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. జిడిపి నీటి కోసం తమపై వత్తిడి తీసుకువస్తే ప్రయోజనం లేదని తాము అంగీకరించినా కాలువ వెంట ఉన్న గ్రామాల నుంచి సమస్య వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. జిడిపి, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో ఉన్న నీటి నిల్వలు, నగర పాలక సంస్థ, నీటి పారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం మే 3వ వారం నుంచి నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు రంగంలోకి దిగితే తప్ప నీటి సమస్య నుంచి ప్రజలను గట్టెక్కించలేరని అభిప్రాయపడుతున్నారు. అయితే నగర పాలక సంస్థ అధికారులు నీరు ఉన్న ప్రైవేట్ బోర్లను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.ప్రజల గొంతెండే రోజు దగ్గరపడుతోంది. నగర దాహార్తి తీర్చేందుకు పని చేయాల్సిన అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం కారణంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం నగర దాహార్తి కోసం నిర్మించిన మునగాలపాడు వద్ద నిర్మించిన సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయి మరో 15, 20 రోజులకు మించి ప్రజల అవసరాలను తీర్చే పరిస్థితి లేదు. దీంతో మే నెలలో నగర ప్రజలు గుక్కెడు నీటి కోసం అలమటించే ప్రమాదం పొంచి ఉందని అధికారులే అనధికారికంగా అంగీకరిస్తున్నారు