YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఆంజనేయుడు జన్మించిన ప్రదేశం ఎక్కడ?

ఆంజనేయుడు  జన్మించిన ప్రదేశం ఎక్కడ?

 యువ న్యూస్ కల్చరల్ బ్యూరో:

ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు. మరి హనుమంతుడు జన్మించిన ప్రదేశం ఎక్కడ? ఆ పుణ్యస్థలం గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమంతుడు జన్మించిన స్థలం పైన అనేక భిన్నాభిప్రాయాలు ఉండగా, మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రదేశంలోని అంజనేరి అనే కొండ ఉన్న ప్రదేశంలో హనుమంతుడు జన్మించినట్లుగా చెబుతారు. ఈ ఆంజనేరి పర్వతం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయం వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇక్కడి అంజనేరి పర్వతం కింద హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో అంజనాదేవి ఒడిలో పసిబాలుడి రూపంలో ఉన్న హనుమంతుడు భక్తులకి దర్శనం ఇస్తాడు.

హనుమంతుడు ఈ ప్రదేశంలోనే జన్మించినట్లుగా పురాణాలూ కూడా చెబుతున్నాయి. అంజనాదేవి పుత్రుడు కనుక తన తల్లి పేరుమీదుగా ఈ ప్రాంతానికి అంజనేరి అనే పేరు వచ్చినదని చెబుతారు. ఇక్కడే గోదావరి నది పుట్టినది అంటారు. ఇక హనుమంతుడు జన్మించిన ఈ కొండని చేరాలంటే మొత్తం మూడు కొండలను దాటుకొని వెళ్ళాలి. హనుమంతుడి భక్తులు హనుమాన్ చాలీసా చదువుతూ ఈ కొండని ఎక్కుతారని, ఈ కొండపైకి చేరుకోవడం అందరికి సాధ్యం కాదని అంటారు.



ఈ పవిత్ర పుణ్యస్థలంలో ఉన్న ఈ కొండ హనుమంతుడి ముఖాన్ని పోలి ఉండటం ఒక విశేషం. అయితే ఇక్కడ ఒక వింత వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడి వాటర్ ఫాల్స్ లోని నీరు కింద నుండి పైకి పడుతుంటాయి. అందుకే ఈ వాటర్ ఫాల్ ని రివర్స్ వాటర్ ఫాల్ అని అంటారు.

ఇక మహారాష్ట్రలోని నాసిక్ లో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడి గోదావరి నది అవతలి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని పంచవటి అని పిలుస్తారు . అయితే శ్రీరాముడు అరణ్యవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతుడై ఇక్కడే నివాసం ఉన్నాడని పురాణం. అయితే ఐదుగురు గంధర్వులు శాపానికి గురై మర్రి చెట్టు వలె ఉండే ఈ ప్రాంతానికి పంచవటి అనే పేరు వచ్చినది అని అంటారు. అంతేకాకుండా ఇక్కడ ఐదు మర్రిచెట్లు కలసి ఒక గుహవలె కనిపిస్తాయి, ఈ ప్రదేశాన్ని పర్ణశాల అని పిలుస్తారు. ఇక్కడికి కొంచం దూరంలోనే సీతగుహ అనే పేరుతో ఒక గుహ కూడా ఉన్నదీ. శ్రీరాముడు ముగ్గురు రాక్షసులతో యుద్ధం చేస్తూ, సీతాదేవిని ఈ గుహలో ఉండమని చెప్పి ఆ రాక్షసులను సంహరించాడని పురాణం.

ఈవిధంగా హనుమంతుడు జన్మించిన ఈ అంజనేరి అనే పవిత్ర పుణ్యస్థలంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అంజనాదేవి ఒడిలో పసిబాలుడి రూపంలో ఉన్న హనుమంతుడిని దర్శించి తరిస్తారు.

Related Posts