యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
టీవీలు, సెల్ ఫోన్లతో అధిక సమయం వెచ్చించవద్దని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. వీటి వల్ల మానవ సంబంధాలు బలహీనమవడమే కాక, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. టీవీలు, ఫోన్లకు అంటుకుపోయే సంస్కృతికి దూరంగా ఉండాలని అన్నారు. మన జీవనశైలికి శారీరక శ్రమ అత్యంత అవసరమని చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్- కేర్ హాస్పిటల్స్ సంయుక్తంగా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతలలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. మెరుగైన వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు.