YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన మమతా

గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన మమతా

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

వామపక్షాలకు కంచుకోటగా పశ్చిమబెంగాల్‌ ఉన్నన్నాళ్లు పార్టీ గుర్తే తప్ప నేతల పేరుతో ప్రచారం లేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. రాష్ట్రానికి వచ్చేవారెవరికైనా కనిపించేది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కటౌట్లే. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనైనా, హావ్‌డా రైల్వేస్టేషన్లోనైనా దిగిన వారిని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లుగా ఎదురుగా ఆమె కటౌట్‌ కనిపిస్తుంది. భిన్నమైన పంథా ఎంచుకున్న దీదీ ఇప్పుడు మోడీతో ఢీ అంటే ఢీ అంటోంది. దశాబ్దాలుగా కమ్యూనిస్టుల పాలనలో ఉన్న పశ్చిమబెంగాల్‌లో రాజకీయాలను మార్చేయగలిగిన దీదీ మొదటినుంచి భిన్నమైన పంథాను అనుసరించారు. రాజకీయ కుటుంబంలో జన్మించకపోయినా, రాజకీయాల్లో చేరకముందు ప్రజల్లో ప్రాచుర్యం లేకపోయినా, రాజకీయ గురువులంటూ లేకపోయినా 30 ఏళ్లకే ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టగలిగిన ఘనత ఆమె సొంతం. కాంగ్రెస్‌ నుంచి చాలామంది వీడిపోయి సొంత కుంపట్లు పెట్టుకున్నా తర్వాత మాతృసంస్థ గూటికే చేరిపోయారు. మమత మాత్రం దానికి భిన్నంగా ఇప్పటికీ అస్తిత్వం కాపాడుకుంటూ వస్తున్నారు. టాటా కార్ల పరిశ్రమ కోసం బలవంతంగా భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ కోల్‌కతా-ఢిల్లీ రహదారిని వారాలపాటు స్తంభింపజేసిన మమతే అధికారంలోకి వచ్చాక అలాంటి నిరసనలపై ఉక్కుపాదం వేయడం విశేషం. వామపక్షాల పాలన కొనసాగినన్నాళ్లూ రాష్ట్రంలో ఏటా కనీసం మూడు నాలుగుసార్లు బంద్‌లు జరిగేవి. మమత వచ్చాక అవన్నీ బంద్‌ అయిపోయాయి. మావోయిస్టుల బెడదనూ ఆమె దాదాపు రూపుమాపగలిగారు. అదే సమయంలో వ్యక్తి పూజను బెంగాల్‌ రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఎన్నికలను తనకు, ప్రధానికి మధ్య సమరంగా మార్చేయగలిగారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపర కాళిలా మారారు. ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మీద వివర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాజకీయ ఆరోపణలు దాటి వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బరంపురం కాంగ్రెస్‌ అభ్యర్థి అధీర్‌ చౌదరీ మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన భార్య పేరు ప్రస్తావించలేదని మమత ఆరోపించారు.

Related Posts