తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని సామెత.. ఎన్నికల ప్రసంగాల్లో శృతి తప్పిన యోగీపై ఈసీ నిషేధం విధించింది. అయితే మూడు రోజులు మౌన వ్రతం పాటించాలంటే యోగీ లాంటి నేతకు ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకున్న వేళ ఈ మూడు రోజుల టైమ్ లో యోగీ ఏం చేశారు? యోగీ ఆదిత్య నాధ్ బీజేపీ కి ఆయనొక స్టార్ కాంపెయినర్. ఉత్తర ప్రదేశ్ ను ఏక ఛత్రాధిపత్యంగా ఏలుతున్న అతిపిన్న వయస్కుడు. మాటల్లో దిట్ట. వివాదాల పుట్ట ప్రత్యర్ధులపై చెలరేగిపోడంలో మోడీయే టాప్ నేత అనుకుంటే యోగీ ఆయనకన్నా మరో రెండాకులు ఎక్కువే చదివారు. యోగీ ఏం మాట్లాడినా సంచలనమే. ఏం చేసినా వివాదమే అధికారంలోకి రాగానే యూపీ లో జిల్లాల పేర్లు మార్చిన ఘనుడు.. హిందూ సంస్కృతి సంప్రదాయాల పట్ల మక్కువ ఎక్కువ.. ప్రచారంలో కూడా హిందూత్వ ను బాగా ప్రమోట్ చేస్తారు.. యూపీలో బీఎస్పీని ఉద్దేశించి మీకు ఆలీ ఉంటే మాకు బజరంగ్ బలీ ఉన్నాడంటూ కామెంట్ చేసి ఈసీ ఆగ్రహానికి బలయ్యారు. యోగీ మీద ఈసీ నిషేధం విధించడానికి ఇదొక్కటే కారణం కాదు కొంత కాలంగా ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతున్నారు.. ముస్లిం జెండాలను గ్రీన్ వైరస్ తో పోల్చారు. సైన్యాన్ని మోడీ సేన అంటూ హడావుడి చేశారు.. ఇలా చెబుతూ పోతే యోగీ ఖాతాలో చాలానే పడతాయి. దాంతో ఈసీ ఆయనపై 72 గంటల నిషేధం విధించింది. అయితే తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరుకోదు మరి.. అందుకే యోగీ నోటిని బంద్ చేసి కాలికి పని చెప్పారు. మూడు రోజులూ వరసగా హిందూ ఆలయాలను సందర్శించారు.. ఎక్కడా ప్రసంగాలు చేయకూడదు కాబట్టి తన మార్కు ప్రచారం ఇలా చేశారనమాట. మంగళవారం ఉదయం నుంచి యోగీపై నిషేధం ఉంది. ఆ వెంటనే ఆయన తన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. లక్నోలోని హనుమాన్ సేతూ ఆలయం సందర్శించారు. అక్కడ హనుమాన్ చాలీసా చదివారు. బుధవారం ఉదయమే అయోధ్యకు బయల్దేరారు. అక్కడ తాత్కాలిక ఆలయంలో రాంలల్లా విగ్రహాలుంచిన చోట ప్రార్ధనలు చేశారు.ఆ తర్వాత హనుమాన్ గడీ ఆలయానికీ వెళ్లారు. అక్కడ పూజలు చేశారు.అయోధ్యలో ఓ దళితవాడని సందర్శించారు. అక్కడ మహావీర్ అనే ఓ దళితుడి ఇంటికి వెళ్లారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకం కింద లబ్ది పొందిన అతగాడి ఇంట్లో భోజనం చేశారు. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ను కలుసుకున్నారు. ఆపై దిగంబర ఆఖాడాకు వెళ్లి మహంత్ సురేష్ దాస్ దగ్గర కూర్చున్నారు.సాయంత్రానికి దేవి పట్నం చేరుకుని దుర్గామాత సన్నిధిలో పూజలు చేశారు. ఆ రాత్రికి అక్కడే బస చేశారు. యోగీ చేసిన ఈ పర్యటనలన్నీ ఆయన వ్యక్తిగతమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద మూడు రోజులూ యోగీ ఆలయాల సందర్శనతో, వ్యక్తిగత పర్యటనలతో బిజీ బిజీగా గడిపేశారు.యోగీపై నిషేధం గురువారంతో ముగుస్తుంది కాబట్టి శుక్రవారం నుంచీ మళ్లీ ప్రచారం షురూ అవుతుంది.