YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పార్లమెంటులో తగ్గుతున్న ఇండిపెండెంట్లు!

పార్లమెంటులో తగ్గుతున్న ఇండిపెండెంట్లు!

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

లోక్ సభ లో ఒక శక్తివంతమయిన వర్గం అంతరించిపోతున్నది.ఒకపుడు పార్లమెంటులో వాళ్ల దే హవా. రూలింగ్ పార్టీ తర్వాత బలమయిన వర్గం వాళ్లే. హేమాహేమీలు ఈ వర్గంలో ఉండేవాళ్లు. వాళ్ల మాట, ధాటికి విలువ ఉండేది.తమ వాణిని వినిపించేందుకే వాళ్ల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పార్లమెంటుకు వచ్చే వారు. ప్రజలు కూడా కాంగ్రెస్ సభ్యులున్నా వాళ్లని ఖాతరు చేయకుండా ఈ క్యాటగరి సభ్యులకు వోటేసే గెలిపించే వారు.  ఈ వర్గం ఏమిటో కాదు, స్వతంత్ర అభ్యర్థులు.ఒక పార్టీ తరఫున కాకుండా స్వతంత్రంగా ఎన్నికల్లో నిలబడి గెలిచి పార్లమెంటును, దేశాన్ని తమవైపు తిప్పుకునే వాళ్లు. ఇలాంటి వాళ్లు 1952లో ఏర్పాటయిన మొదటి లోక్ సభలో 36 మంది ఉండేవారు. ఇపుడు ముగుస్తున్న లోక సభలో వారి సంఖ్య కేవలం ముగ్గురికి, అక్షరాలా ముగ్గురికి, పడిపోయింది.నిజానికి ప్రతిఎన్నికలో చాలా మందే స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తుంటారు. అయితే వీళ్లో గెలిచే వాళ్ల సంఖ్య బాగా తక్కువ.వీళ్లలో చాలా మంది ఇతర పార్టీలకు ఏజంట్లో, నామమాత్రంగా పోటీ చేసేవాళ్లో ఉంటారు. ప్రజల సమస్యలను పార్లమెంటు ముందుంచాలన్న ఉద్దేశంతో ఇండిపెండెంట్లుగా పోటీ చేసే వారు చాలా చాలా తక్కువ.1951 నుంచి ఇప్పటి దాకా మొత్తం 202 మంది ఎంపిలు స్వతంత్ర (ఇండిపెండెంట్స్) అభ్యర్థులుగా గెలిచారు. ఈ వర్గానికి సంబంధించి మొదటి లోక్సభదే ఇంతవరకు అగ్రస్థానం. రెండో సారి ఎక్కువ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందింది 1967లోఏర్పడిన నాలుగో సభలో.అపుడు 34మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. వీరి సంఖ్య 1957 లో  25, 1962లో 19, 1971లో 15.మొదటి అయిదు లోక్ సభల్లో ఒక్కొక్క సారి దాదాపు 15 మంది స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. అయితే ఈ వరవడి ఆరో లోక్ సభ నుంచి మారడం మొదలుపెట్టింది. 1977 లో ఏర్పడిన లోక్ సభలో కేవలం 7 మంది మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు. 1980 లో వీరి సంఖ్య నాలుగుగకు పడిపోయింది. 1984లో 9 మంది, 1989లో8 మంది ఇండిపెండెంటు సభ్యలున్నారు.1991లో ఏర్పడిన 10వ లోక్ సభలో ఒకే ఒక్కరు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే, 1996లో మళ్లీ వీరి సంఖ్య 11 కు పెరిగింది. 1999లో ఇది 6 కు పడిపోయింది. యుపిఎ-1 లో ఆరుగురు, యుపిఎ-2లో 11 మంది స్వతంత్ర అభ్యర్థలున్నారు. మోదీ హయాంలో వీరి సంఖ్య మూడు కు పడిపోయింది.మొదటి లోక్ సభలో ఎక్కువ మంది ఇండిపెండెంటు అభ్యర్థులు  ఎంపికయింది అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచే. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి 9 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపికయ్యారు.మొదటి లోక్ సభలో ఆంధ్రప్రాంతంనుంచి గెలుపొందిన ఇండిపెండెంట్లు : ఎస్ వి లక్ష్మీనరసింహం (గుంటూరు), రాయసం శేషగిరి (నంద్యాల),చాపల మడుగు రామయ్య చౌదరి (నరసరావు పేట), బెజవాడ రామచంద్రారెడ్డి (నెల్లూరు)మంగళగిరి నానాదాసు (ఒంగోలు), ఎన్ రామశేషయ్య (పార్వతీపురం), హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ్ (విజయవాడ),డాక్టర్ లంకా సుందరం(విశాఖ పట్నం), మల్లుదొర (విశాఖ పట్నం).మొత్తంగా తీసుకుంటే, ఉత్తర ప్రదేశ్ నుంచి ఇంతవరకు 28 మంది అభ్యర్థులను అందించింది.ఆ రోజుల్లో  లోక్ సభకు స్వతంత్ర అభ్యర్థులుగా గెలవాలంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న హేమాహేమీలతో తలపడాలి. దీనికి స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఒక రాజకీయ చరిత్ర, మంచి వగ్ధాటి, సేవా గుణం ఉండి తీరాలి. అలాగే కాంగ్రెస్ కు మించిన సైద్ధాంతిక పటుత్వం కూడా ఉండాలి.  ఆ రోజుల్లో స్వతంత్రులుగా గెలిచిన వారంతా ఇలా ప్రజల్లో చాలా పేరున్న వారే కాదు, దీర్ఘకాలిక ప్రజానాయకులు. మేధావులు, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవారు, కాంగ్రెస్ నాయకత్వానికి ఏ విషయంలో కూడా తీసిపోని వారే.వారిలో కొందరు ప్రముఖులు: అచార్య జెబి కృపలాని ( రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు), హరీంద్ర నాథ్ చట్టోపాధ్యాయ (విజయవాడ), ఎం ఎస్ అనే (నాగపూర్) మార్క్సిస్టు నాయకుడు ఎస్ ఎం బెనర్జీ (కాన్పూర్), వికె కృష్ణ మీనన్( రెండుసార్లు, ఒక సారి ప.బెంగాల్ లోని మిడ్నాపూర్ నుంచి, రెండో సారి ట్రివేండ్రం నుంచి),ఎం ఆర్ మసాని (రాంచి), ఎన్ సి చటర్జీ ( బర్ద్వాన్), అనీ మాస్కరీన్ (ట్రివేండ్రం) మహారాజ కర్నిసింగ్ (బికనీర్), దళితనాయకుడు ఎన్ శివరాజ్(మద్రాస్), ఎల్ ఎం సింఘ్వి (జోద్ పూర్ ),జిజి స్వెల్ (షిల్లాంగ్ )షమీన్ షమీన్ (శ్రీనగర్). వీళ్లంతా ఇండిపెండెంట్ సభ్యులుగా గెలవడమే కాదు, తమ ఉపన్యాసాలతో,అనుభవంతో , విజ్ఞానంతో లోక్ సభ చర్చలను అర్థవంతం చేశారు.ఇలాంటి వర్గం ఇపుడేమయింది. ఎందుకు మాయమయింది?రాజకీయాల్లో గుణాత్మకమయిన మార్పురావడమే ఇండిపెండెంట్ల వర్గం అంతరించి పోయేందుకు కారణమని రాజకీయపండితులు చెబుతున్నారు.’ఆరోజుల్లో ఇంకా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ఉండింది. నాయకులంతా ప్రజాజీవితంలో చాలా కాలం పనిచేసి ప్రతిష్టపెంచుకున్నవాళ్లే. వాళ్లజనాదరణ,జనామోదం ఎక్కువగా ఉండింది.అన్నింటికంటే ముఖ్యంగా వారికి స్వతంత్ర వ్యక్తిత్వం, స్వతంత్ర ఆలోచనలు , సొంత భావజాలం ఉండింది. ఈ విషయంలో ఎవరితో రాజీపడేవారు. కాదు, ఈ వ్యక్తిత్తం, స్వతంత్ర ఆలోచనలకోసమే వారంత ఇండిపెండెంటుగా పోటీ చేసే వారు, తమ ఐడియాలజీనే సభలో వినిపించేవారు. గెలిచి రూలింగ్ పార్టీలోకి దూకి అధికారంలో ఉండాలనేది వారి లక్ష్యం కాదు. అపుడు ఎన్నికల్లో డబ్బు పాత్ర బాగా తక్కువ. ప్రజలు కూడా నాయకత్వ లక్షణాలను చూసేవారు. ఇపుడు రాజకీయాలనుంచి స్వతంత్ర వ్యక్తితం, సొంత ఆలోచనలు , సిద్ధాంతాలు…అన్నీ ఆవిరిపోయాయి. డబ్బు అధికారం లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ వాతావరణంలో అలనాటి ఆలోచనలతో ఉన్నవాళ్లు పోటీ చేయలేరు.అందుకు ఆ తరం అంతరించిపోతున్నది.ఆ రోజుల్లో కూడా పార్టీ నాయకత్వంతో నాయకులు విబేధించేవారు. వారికి కూడా టికెట్ దొరికేది కాదు. వికె కృష్ణ మీనన్ కు కాంగ్రెస్ రెండు సార్లు టికెట్ ఇవ్వలేదు. అయితే, అయన రెండు సార్లు ఇండిపెండెంటుగా పోటీ చేసి గెలుపొందారు.ఇపుడా పరిస్థితి కనిపించదు. పార్టీ టికెట్ రాకపోతే, అరగంటలో మరొక పార్టీలోకి దూకేసి టికెట్ తెచ్చుకుంటున్నారు తప్ప స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం లేదు.ఎందుకు?దీనికి కారణం, రాజకీయాల్లో వచ్చిన మౌలికమయిన మార్పు అని చెబుతున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఇ. వెంకటేశ్ ‘ఇటీవల ఏకకాలంలో రెండు రకాల మార్పలు వచ్చాయి. సిద్ధాంతాలు కనుమరుగయ్యాయి, దీనితో స్వతంత్ర ఆలోచనలకు తావు లేకుండాపోయింది. అదే సమయంలో పార్టీ అభిప్రాయాలకు ప్రాముఖ్యం పెరిగింది. ఫలితంగా ఏదో ఒక పార్టీతో జతకట్టినపుడే ప్రయోజనం ఉంటుందని అంతా గుర్తించారు .  స్వతంత్ర వ్యక్తికి పార్లమెంటులో చోటుండటం లేదు. పార్టీల సంఖ్యను బట్టి మాట్టాడే అవకాశం వస్తున్నది. పార్టీ మద్దతు ఉంటేనే  మాట్లాడవచ్చు. దీనికితోడు ఈ మధ్య రాజకీయాల లక్ష్యం అధికారమయింది. పూర్వం ఐడియాలజీకి ప్రాముఖ్యం ఉండేది.పార్టీల సంఖ్యపెరగడం, అధికారం పరమావధి కావడంతో సంకీర్ణ రాజకీయాలు మొదలయ్యాయి. సంకీర్ణ రాజకీయాలు రావడంతో రాజకీయాల్లోకి పవర్ డబ్బు పెద్ద ఎత్తున వచ్చి చేరాయి. దీనితో ఇండిపెండెంట్ల సంఖ్య పడిపోవడం మొదలుయింది. ఇది పివి నరసింహారావుతో మొదలయింది. ఆనాడున్నట్లు సైద్దాంతిక స్వతంత్ర అభ్యర్థులు (ఐడియాజికల్ ఇండిపెండెంట్స్ ) ఇక ఉండరు. ఉన్నవారికి కూడ ఏదో ఒక పార్టీమద్ధతు ఉంటుంది,’ అని వెంకటేశ్ వివరించారు.

Related Posts