YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొల్లేరులో ఉప్పుటేర్లు..

కొల్లేరులో ఉప్పుటేర్లు..
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఆసియాలోనే మంచినీటి సరస్సుల్లో అతి పెద్ద సరస్సు నేడు ఉప్పునీటితో నిండిపోతోంది. పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఉప్పునీటి రొయ్యల సాగుతో పాటు కొల్లేరులోనే రొయ్యలసాగు యథేచ్ఛగా సాగించడంతో కొల్లేరులో ఉప్పు పేరుకు పోతోంది. టన్నుల కొద్దీ ఉప్పు, రసాయనాలు కొల్లేరులో ఇష్టారాజ్యంగా పోసి సాగు చేస్తున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు. పరిరక్షణకు ఎన్ని చట్టాలున్నా.. ఎంతో మంది అధికారులు ఉన్నా.. కొల్లేరును పరిరక్షించలేకపోతున్నారు. సామాన్యులు కొల్లేరులో కొద్దిపాటి నీటిని తోడుకున్నా ఊరుకోని అధికారులు ఇప్పుడు మాత్రం ముడుపుల మత్తులో ఉప్పునీటి రొయ్యల సాగును అడ్డుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

నిత్యం పక్షుల కిలకిలరావాలతో మనోహరంగా ఉండే కొల్లేరు తీరం తీరు నేడు మారుతోంది. కాంటూరు పరిధిలో కొట్టేసిన భూముల్లో సంప్రదాయం ముసుగులో సాగుచేసుకుంటున్న చేపల సాగులో మరో అడుగు పడింది. ఇప్పటి వరకు కేవలం జీరో సైజు మంచినీటి చేపపిల్లలు సాగు చేసుకునే కొల్లేరు భూముల్లో ఉప్పునీటి రొయ్యల సాగు మొదలైంది. కాంటూరు భూములను ఉప్పునీటి క్షేత్రాలుగా మార్చివేస్తున్నారు. కొట్టేసిన చెరువులకు చిన్నపాటి గట్లు వేసి.. దాని నిండా నీటిని తోడి టన్నులకొద్దీ ఉప్పును నీటిలో చల్లి కొల్లేరు నీటిని ఉప్పుమయం చేసేస్తున్నారు. ఆ నీటిలో వనామీ రొయ్యల సాగు చేపడుతున్నారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ దుశ్చర్యను అడ్డుకోవడానికి అధికారులు సైతం ముందుకు రాకపోవడంతో యథేచ్ఛగా సాగుకు జరగాల్సిన తంతులన్నీ సాగిపోతున్నాయి. కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం చట్టం, 120 జీవోలో నిబంధనలకు తూట్లు పడుతున్నా  అధికారులు మొద్దునిద్రను వీడడం లేదు. కొల్లేరు గ్రామాల్లోని ఓట్ల కోసం రాజకీయ నాయకులు సైతం వారిని ప్రోత్సహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

కొల్లేరులో ఇష్టారాజ్యంగా చేపల చెరువులు పెరిగిపోవడంతోనే 2006 కొల్లేరు ఆపరేషన్‌ ద్వారా వాటిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని కొల్లేరు భూములను సంప్రదాయం ముసుగులో స్థానికులు సాగు చేసుకుంటున్నారు. వర్షాకాలంలో వచ్చే వరద ఉద్ధృతి క్రమంగా తగ్గి కొట్టేసిన చెరువుల్లో నిల్వ ఉన్న నీటిలో డిసెంబరులో చేపపిల్లల్ని వదిలి.. తిరిగి నీరు పూర్తిగా ఎండిపోయిన తర్వాత మార్చిలో పట్టుబడి చేసుకుంటారు. 2008 నుంచి కైకలూరు మండలం మండవల్లి మండలాల్లోని కొట్టేసిన భూముల్లో కృత్రిమ చేపల సాగు ఏటికేడు పెరుగుతోంది. ఇదే క్రమంలో మరో అడుగు ముందుకు వేసి రొయ్యల సాగును చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చెరువుల్లో రొయ్యల సాగు చేపట్టారు. కొన్ని చెరువుల్లో రొయ్య పిల్లను వేయగా మరికొన్ని చెరువులకు కాకినాడ, విశాఖ ప్రాంతాల్లº రొయ్య పిల్ల్లను బుక్‌ చేసినట్లు సమాచారం. రొయ్యల సాగుపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలోని ప్రధాన కొల్లేరు మండలాలైన కైకలూరు, మండవల్లి మండలాల్లోని 400 ఎకరాల్లో ఉప్పునీటి రొయ్యలసాగు జరుగుతోంది. ముఖ్యంగా కైకలూరు మండలంలోని శృంగవరప్పాడు, కొల్లేటికోట, వడ్లకూటితిప్ప, పందిరిపల్లి గూడెం, గుమ్మళ్లపాడు, మండవల్లి మండలంలో ఇంగిలిపాకలంక గ్రామాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులకు పూర్తిస్థాయిలో సమాచారం ఉన్నా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, ముడుపుల మత్తుతో అడ్డుకోవడానికి ముందుకు లేదు. కొల్లేరులో రోజురోజుకూ పెరిగిపోతున్నా అక్రమ సాగుతో తీవ్రస్థాయిలో కాలుష్యం వెలువడుతుంది. గడిచిన పదేళ్లలో కొల్లేరు పరీవాహక ప్రాంతంలో వంద శాతం కాలుష్యం పెరిగిపోయింది. కొల్లేరు పరీవాహక ప్రాంతంలో అక్కడక్కడా కనిపించే ఉప్పునీటి రొయ్యలసాగు ప్రస్తుతం కొల్లేరులోనికే చొచ్చుకొచ్చింది. ఫలితంగా సరస్సులో కాలుష్యం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. నీటిలో హానికరమైన క్రిమి సంహారక అవశేషాలు, పాలిసైక్లిక్‌ హైడ్రో కార్బన్లు, భారీ లోహ అవశేషాలు పెరిగిపోతున్నాయి. రొయ్యల సాగులో విచ్చలవిడిగా వాడుతున్న అధిక గాఢత పురుగుమందులలో నీటితో పాటు కొల్లేరు భూములు విషతుల్యమవుతున్నాయి. మంచినీటి సరస్సు క్రమేణా ఉప్పునీటి సరస్సుగా రూపాంతరం చెందుతోంది.

కొల్లేరే ప్రాణంగా జీవిస్తున్న విలువైన నల్లజాతి చేపలు, అరుదైన పక్షులకు ఉప్పు నీరు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. సరస్సులో ఉప్పుశాతం పెరిగిపోవడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో వీటిని నమ్ముకుని వేల కిలోమీటర్ల నుంచి వస్తున్న విదేశీ పక్షులు సైతం ఆకలితో మలమలమాడిపోవాల్సి వస్తోంది. ఖండాలు దాటి సంతానోత్పత్తికి వస్తున్న లక్షల పక్షులు అర్ధాంతరంగానే వెనుతిరుగుతున్నాయి. కొల్లేరులో విషతుల్యంగా మారిన నీటిలో సంచరిస్తున్న పక్షులు మృత్యువాతపడుతున్నాయి. పరీవాహన ప్రాంతాల్లోని పశువులకు సైతం ప్రస్తుతం గడ్డుకాలం కొనసాగుతోంది. కొల్లేరు లంక గ్రామాల్లో వేలాదిగా ఉన్న పశువులు ఉప్పునీటిని తాగలేక తల్లడిల్లుతున్నాయి.

కొల్లేరులో జరుగుతున్న అక్రమాలకు అటవీ శాఖాధికారులు పూర్తిస్థాయిలో నిలువరించకపోతే సరస్సు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మండవల్లి మండలం ఇంగిలిపాకలంక, కైకలూరు మండలం వడ్లకూటితిప్ప, శృంగవరప్పాడు, కొల్లేటికోట, గుమ్మళ్లపాడు గ్రామాల్లోనే సాగవుతున్న రొయ్యల సాగు మరిన్ని గ్రామాలకు విస్తరించే ప్రమాదముంది. మొద్ద నిద్రను, ఒత్తిళ్లను పక్కన పెట్టి కొల్లేరు పరిరక్షణకు అధికారులు ముందుకు రావాలని పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులు కోరుతున్నారు.

Related Posts