యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపికపై భారీగానే కసరత్తు చేశారు. ప్రతి నియోజకవర్గంపై సమీక్ష చేసి, అక్కడి కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని మరీ టిక్కెట్లు ఖరారు చేశారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని స్థానాల్లో వారసులకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అదే సమస్యగా మారిందన్న చర్చ తెలుగుదేశం పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. సీనియర్ నేతలయిన వారి కోరిక మేరకు టిక్కెట్లు ఇచ్చినా వారసులు పోలింగ్ సమయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారన్నది ఈనెల 11వ తేదీన తేలింది. దీంతో వారసులకు టిక్కెట్లు ఇచ్చి తప్పు చేశామా? అన్న కోణంలో సీనియర్ నేతలు చర్చించకుంటున్నట్లు తెలుస్తోంది.నిజమే… వారసులను ప్రజలు ఆదరిస్తారా? ప్రజల సంగతి కాసేపు పక్కన బెడితే…‘‘ఆ నియోజకవర్గం వారి కుటుంబానికే ధారాధత్తం చేయల్సిందేనా? ఇక ఈ నియోజకవర్గంలో కష్టపడుతున్న మనకు ఎప్పటికీ ఛాన్సు రాదు. ’’ ఇదీ ఆ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతల ఆవేదన. అందుకే వారసులు పోటీచేసిన అనేక నియోజకవర్గాల్లో కీలకమైన నేతలు పార్టీ నుంచి ముందుగానే బయటకు వెళ్లిపోగా, మరికొందరు పార్టీలోనే ఉండి సహాయ నిరాకరణ చేశారన్నది పోలింగ్ పోస్ట్ మార్టంలో తేలుతుంది. వారసులు పోటీ చేసిన అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కన్పించింది. సీనియర్ నేతల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం వీరిలో కన్పించలేదన్నది ప్రధాన కారణంగా చెబుతున్నారు.ఉదాహరణకు రాప్తాడు, తాడిపత్రి తీసుకుంటే…. రాప్తాడులో పరిటాల సునీత పోటీ చేసి ఉంటే ఎన్నిక ఏకపక్షమయ్యేదేనని అంటున్నారు. సునీత కోరిక మేరకే ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ కు సీటిచ్చారు. అయితే నియోజకవర్గంలో ఉన్న మహిళలు, తటస్థులు శ్రీరామ్ వైపు మొగ్గుచూపలేదంటున్నారు. అదే సునీతమ్మ అయితే ఆమె వైపే నిలిచేవారంటున్నారు. ఇక తాడిపత్రిలోనూ అంతే. జేసీ కుటుంబానికి కంచుకోట అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి బరిలోకి దిగడంతో గెలుపుపై సందేహాలుకలుగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా తాడిపత్రిలో టైట్ ఫైట్ జరిగిందన్న వార్తలు రావడం వారసుడి పుణ్యమేనన్నది టీడీపీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.అలాగే శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డికి టిక్కెట్ దక్కంది. గోపాలకృష్ణారెడ్డి అయితే ఇది ఖచ్చితంగా గెలిచే సీటు అని చెప్పే పరిస్థితి. కానీ సుధీర్ రెడ్డి కావడంతో టీడీపీకి విజయావకాశాలు తక్కువయ్యాయనే చెప్పాలి. కర్నూలు సీటీ నియోజకవర్గంలోనూ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ పట్ల కూడా ప్రజల్లో అదే వైఖరి కన్పిస్తుందంటున్నారు. అన్నీ ఆ కుటుంబానికేనా? అన్న ప్రశ్న ప్రజల్లో రావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటున్నారు. ఇక విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతిరాజు కుమార్తె ఆదితి కూడా ఓటమి అంచున ఉందంటున్నారు. ఇక్కడ టీడీపీ క్యాడర్ ఎంపీ ఓటు అశోక్ గజపతిరాజుకు, ఎమ్మెల్యే ఓటు వైసీపీకి వేసి ఆ కుటుంబంపై కసి తీర్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి శ్యాంబాబు పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. మొత్తం మీద లోకేష్ టీం ను పార్టీలో బలోపేతం చేద్దామనుకుంటే ఎవరి పరిస్థితీ అంత బాగాలేదన్న చర్చ టీడీపీలో జరుగుతుంది.