YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోట్ల కుటుంబానికి కష్టకాలమేనా

కోట్ల కుటుంబానికి  కష్టకాలమేనా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాంగ్రెస్ కు ఇక ఆంధ్రప్రదేశ్ లో చోటులేదని భావించిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబానికి కాంగ్రెస్ తో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఎన్నికలకు ముందు తెంచుకున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిక పార్లమెంటులోకి ఈసారి అడుగుపెట్టాలన్న ఆశతోనే. తనకున్న ప్రత్యేక బలంతో పాటు టీడీపీ ఓటు బ్యాంకు కలసి వస్తుందని కోట్ల అంచనా వేశారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత పరిస్థితిని సమీక్షించుకుంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విజయం నల్లేరు మీద నడక కాదన్నది వాస్తవం. ఆయన ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.కర్నూలు అంటే కోట్ల కుటుంబానికి పెట్టని కోట. అది ఒకప్పటి మాట. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. వారంతా టీడీపీకి, కోట్ల కుటుంబానికి అండగా ఉండేవారు. ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా వాల్మీకి సామాజిక వర్గం వారు 4.50 లక్షల మంది ఉన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఆ పనిచేయలేకపోయింది. దీంతో ఈ సామాజికవర్గం అధికారపార్టీ పై గుర్రుగా ఉంది. ఈ సామాజిక వర్గం తర్వాత కురుబ, యాదవ సామాజికవర్గం వారు రెండున్నర లక్షల మంది ఉన్నారు. ఎస్సీలు రెండున్నర లక్షల మంది వరకూ ఉన్నారు. చేనేతలు యాభై అయిదువేలమంది వరకూ ఉన్నారు. సామాజికవర్గాల వారీగా చూసుకుంటే పైకి కోట్లకు విజయావకాశాలు కన్పిస్తున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత కొంపముంచిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సంజీవ్ కుమార్ పోటీ చేశారు. సంజీవ్ కుమార్ చేనేత వర్గానికి చెందిన వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి తాను చెబతున్నట్లుగానే అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలకు బీసీలకు కేటాయించింది. ఆ ఎఫెక్ట్ కర్నూలు పార్లమెంటు స్థానంపై పడుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికలలోనూ ఇక్కడ చేనేత వర్గానికి చెందిన బుట్టా రేణుక విజయం సాధించారు. ఆమె తర్వాత టీడీపీలో చేరి టిక్కెట్ రాక మళ్లీ వైసీపీలోకి వచ్చి సంజీవ్ కుమార్ కు మద్దతుగా నిలిచారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి కూడా చివరి నిమిషంలో వైసీపీలో చేరడంతో పార్టీ మరింత బలం పుంజుకుందని చెబుతున్నారు.కర్నూలు పార్లమెంటు పరిధిలో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కేఈ కృష్ణమూర్తి, కోట్ల చేతులు కలపడంతో పత్తికొండ, కోడుమూరు, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకే ఆధిక్యం వస్తుందని కోట్ల వర్గం గట్టిగా నమ్ముతుంది. ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనూ టీడీపీ బలంగా ఉంది. మంత్రాలయంలో మాత్రం వైసీపీకి ఎడ్జ్ ఉందంటున్నారు. ఆదోనిలో హోరాహోరీ పోరు జరిగిందంటున్నారు. మరి డాక్టర్ సంజీవ్ కుమార్ కోట్లకు పట్టున్న ఈ నియోజకవర్గాల్లో ఏ మేరకు ఓట్లను సాధించారోచూడాల్సి ఉంది. అయితే ఎన్నికల అనంతరం అంచనాల ప్రకారం కోట్ల గెలుపు అంత సులువు కాదని స్పష్టమవుతోంది.

Related Posts