యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎంతో ఆసక్తిగా సాగిన గాజువాక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఆయన పార్టీ పెట్టిన తరువాత తొలిసారి పోటీ చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున జనాన్ని ఆకట్టుకోవాలని పవన్ పోటీకి దిగిన సంగతి తెలిసిందే. పవన్ నామినేషన్ ఘట్టం కూడా ఇక్కడ చాలా సందడిగా జరిగింది. గాజువాకలో పవన్ ఫ్యాన్స్, కాపులు, యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ జనసేన సభ్యత్వాలు లక్షకు పైగా నమోదు అయ్యాయి.పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎన్నో అనుకూలతల మధ్యన పవన్ పోటీకి దిగిన తరువాత గాజువాక సీన్ మెల్లగా మారింది. మొదట్లో పవన్ మెజారిటీ లక్షకు తగ్గదన్నారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది రాష్ట్రలోనే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు, మొత్తంగా మూడు లక్షల పై చిలుకు ఓటర్లు ఉన్న అతి పెద్ద అసెంబ్లీ సీటు ఇది. పైగా ఇక్కడ నైసర్గిక పరిస్థితులు భిన్నం. అన్ని వర్గాల సమాహారం. అయితే పవన్ పోటీ అంటూ ప్రతీవారు ఓటు చేస్తారని అంతా భావించారు. అయితే ప్రచారం కీలక ఘట్టంలో పవన్ దూకుడు తగ్గడం, రోడ్ షోలతో సరిపెట్టడం, పూర్తిగా మొత్తం నియోజకవర్గంలో తిరగకపోవడంతో పవన్ కళ్యాణ్ గెలుపుపై అనుమానాలు మెల్లగా బయల్దేరాయి.ఇక ప్రచారం చివర్లో వైసీపీ అధినేత జగన్ గాజువాకలో పర్యటించి తమ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయడంతో కొత్త ఊపు వచ్చింది. నాటి జగన్ సభకు జనం వెల్లువలా విరగబడి వచ్చారు. దాంతో పవన్ మెజారిటీ తగ్గినా గెలుస్తుందని అనుకున్నారు . ఇక పోలింగ్ సరళిని చూసిన తరువాతనే పవన్ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. పవన్, తిప్పల నాగిరెడ్డిల మధ్యన పోరుగా గాజువాక సీటు మారిందని, ఈ నేపధ్యంలో స్థానికుడు, ఎన్నో పోరాటాలు చేసిన వాడు, రెండు సార్లు ఇప్పటికి ఓటమి చూసినవాడు అయిన నాగిరెడ్డి వైపే జనం ఒకింత మొగ్గు చూపారని అంటున్నారు. అంటే ఓ విధంగా సానుభూతి మంత్రం ఇక్కడ పనిచేసి సినీ గ్లామర్ ని పక్కన పెట్టిందని చెబుతున్నారు. 30 ఏళ్ళ లోపు వాళ్ళు పవన్ కి ఓటు వేస్తేజజజ ఆ పైబడిన వారంతా టీడీపీ, వైసీపీలను ఎంచుకోవడం కూడా పవన్ వెనకబడడానికి కారణం అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే పవన్ ఇపుడు గెలుపు కోసం ఊగిసలాడుతున్నారని తెలుస్తోంది. గాజువాకలో సీన్ బాలేదని అభిమానులే అంటున్నారంటే ఇక ఫలితం ఎలా ఉంటుందో మరి.