యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంగళగిరిపై బెట్టింగ్ లు మామూలుగా జరగడం లేదు. ఇక్కడ గెలుపోటములపై తెలంగాణలో సయితం బెట్టింగ్ లు జరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలంగాణ ఎన్నికల సమయంలో కూకట్ పల్లిలో ఏ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ లు జరిగాయో దానికి మించి మంగళగిరి మీద జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలను ఇప్పటికే బెట్టింగ్ రాయళ్లు పందేలు కాసినట్లు సమాచారం. మంగళగిరి ఎన్నికల ముందు వరకూ ఒక సాధారణ నియోజకవర్గమే. అయితే 2019 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరిని ఎంచుకున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టడంతో విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో పోటీ చేయాల్సిన అవసరం లేకపోయినా విపక్షాల విమర్శల నుంచి తప్పించుకునేందుకు నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అదే ఆయన చేసిన తొలి తప్పు అని మేధావులు సయితం అంగీకరిస్తున్నారు. తన సామాజికవర్గం బలం ఏమాత్రం లేని చోట లోకేష్ పోటీ చేశారు.మంగళగిరిలో చేనేత సామాజికవర్గం ఎక్కువగా ఉంటారు. ఆ సామాజికవర్గానికే టిక్కెట్ దక్కుతుందని భావించారు. కానీ అనూహ్యంగా లోకేష్ పోటీ చేయడంతో పద్మశాలి సామాజిక వర్గంలో అసంతృప్తి బయలుదేరింది. లోకేష్ ప్రచారం సమయంలో కూడా కష్టాలు పడాల్సి వచ్చింది. రోడ్ షోలకు జనం కరువైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని చోట్ల మహిళలు నిలదీసిన సంఘటనలు కూడా లోకేష్ ను కలవరపర్చాయి. అయినా దిగాక తప్పదని లోకేష్ మంగళగిరి హద్దులు దాటకుండా ప్రచారాన్ని చేశారు. కానీ ఖచ్చితంగా గెలుస్తారని గ్యారంటీ లేకపోవడమే టీడీపీలో ఆందోళన కల్గించే విషయం. అయితే మంగళగిరిలో చివరి రోజున పెద్దయెత్తున డబ్బులు పంచడం, ఏసీలు, ఫ్రిజ్ లు వంటివి పంచడంతో కొంత కూల్ వాతావరణం కన్పిస్తుందంటున్నారు.మరోవైపు ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సానుభూతి ఎక్కువగా ఉంది.అధికార పార్టీని ఒంటిచేత్తో ఎదిరించారన్న పేరుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రభుత్వం సహకరించకపోయినా తన సొంత డబ్బులతో పలు పధకాలను ఆర్కే ప్రవేశ పెట్టారు. దీంతో ఆయనకు సానుకూల వాతావరణం కన్పిస్తోంది. అంతేకాకుండా ఆర్కేకు టిక్కెట్ దక్కదన్న ప్రచారం కూడా ఆయనకు సింపతీని తెచ్చిపెట్టిందంటున్నారు. మొత్తం మీద నారాలోకేష్ ఓటమి ఖాయమంటూ పెద్దయెత్తున బెట్టింగ్ లు జరుగుతున్నాయి. రూపాయికి రెండు రూపాయల మేరకు బెట్టింగ్ జరుగుతోంది. మొత్తం మీద మంగళగిరిలో గెలుపోటములపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.