యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉత్తరాంధ్ర ఈసారి వైసీపీని ఆదుకుంటుందా…? 2014 ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీకి గట్టి షాక్ ఇచ్చిన జిల్లాలుగా వీటిని భావిస్తారు. ఏకంగా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ విశాఖలో ఓటమి పాలయ్యారు. దాంతో ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలవాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఈసారి ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం పాతిక సీట్లను గతసారి గెలుచుకున్న టీడీపీ ఈసారి వాటిని నిలబెట్టుకోవడం కష్టమేనని అంటున్నారు.వైసీపీ గాలి ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో బలంగా వీచింది. దాంతో టీడీపీ జాతకం తిరగబడుతుందని అంటున్నారు. ఈ మూడు జిల్లాలో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర పార్టీకి మంచి ఊపు ఇచ్చిందని చెప్పాలి. ఆరు నెలల పాటు మూడు జిల్లాల్లో జగన్ పట్టుదలగా చేసిన పాదయాత్రకు మంచి స్పందన లభించింది. దాని ఫలితాలే ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫలానా సీటు గెలుస్తామని ఇపుడు టీడీపీ చెప్పడానికి లేకుండా చేసిన ఘనత వైసీపీదేనని అంటున్నారు. ఇక్కడ ఇద్దరు మంత్రుల సీట్లు డౌట్లో పడ్డాయని తెలుస్తోంది. ఈ జిల్లాలో వైసీపీ మొదటిగా గెలిచే సీటు పాతపట్నం నుంచి రెడ్డి శాంతి అంటున్నారు. దాదాపుగా సగానికి పైగా సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని అంచనాలు ఉన్నాయి.ఇక్కడ విజయనగరంలో కూడా వైసీపీ బాగానే ఈసారి రాణించిందనే చెప్పాలి. ఇక్కడ ఉన్న తొమ్మిది అసెంబ్లీ సీట్లలో కనీసంగా అయిదు సీట్లు, గాలి మరీ బలంగా ఉంటే మొత్తం సీట్లు అన్నట్లుగా వైసీపీ ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు రాజులు గెలుపు కోసం శ్రమించడం వైసీపీ దూకుడుని చెబుతోంది. ఈసారి గెలిచి తీరుతామని పట్టుపట్టి బరిలోకి దిగిన బొత్స ఆయన వర్గం గెలుపు సునాయాసం చేసుకున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం నుంచి జెండా ఎగురవేస్తారా.? లేదా? అన్నది చూడాల్సి ఉంది.విశాఖ జిల్లా విషయానికి వస్తే ముగ్గురు మంత్రుల గెలుపు కూడా సందేహమైంది. పరాజయం ఎరుగని మంత్రి గంటా శ్రీనివాసరావుకు వైసీపీ తరఫున పోటీ చేసిన కేకే రాజు చుక్కలు చూపించారు. అలాగే నర్శీపట్నంలో సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా గెలుపు కోసం ఎదురుచూడాల్సివస్తోంది. అరకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కిడారి సర్వేశ్వరరావు వారసుడు కిడారి శ్రావణ్ కుమార్ ని ఇక్కడ వైసీపీ కట్టడి చేయడంలో విజయవంతమైందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే విశాఖ జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ సీట్లలో సగమైనా గెలుస్తామని ఈసారి వైసీపీ ధీమా వ్యక్తం చేయడం విశేషం.