యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గం అందరి నోళ్లలో నానుతుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో గెలుపును చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొడాలి నాని స్ట్రాంగ్ గా ఉండటంతో దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ను బరిలోకి దింపారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో కొడాలి నాని గెలిచేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకున్నారు. ఇప్పటికే గుడివాడలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కొడాలి మరోసారి జెండా ఎగురవేయడానికి తీవ్రంగానే శ్రమించారంటారు.తనకు ప్రత్యర్ధిగా దేవినేని అవినాష్ బరిలోకి దిగడంతో రంగా హత్యను కొడాలి నాని ఉపయోగించుకున్నట్లు సమాచారం. రంగాను హత్య చేసిన కుటుంబానికే ఓట్లేస్తారా? అని నాని ప్రశ్నిస్తూ ప్రధాన సామాజిక వర్గం ఓటర్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నంచేశారు. ఈ ప్రయత్నంలో నాని సూపర్ సక్సెస్ అయ్యారంటున్నారు. కొడాలి నాని, వంగవీటి రాధాలు మంచి మిత్రులు. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరకుండా చివరి వరకూ కొడాలి నాని ప్రయత్నించారు. అయినా రాధా టీడీపీలో చేరిపోయారు. ఎన్నికలలో కొడాలి నాని రంగా హత్యను ఉపయోగించుకున్నారని, అందులో విజయం సాధించారన్నది విశ్లేషకుల అంచనా. కొడాలి నాని, దేవినేని అవినాష్ లు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడతో ఈ నియోజకవర్గంలో ఉండే ఆ సామాజిక వర్గం ఓటర్లు కొంత కన్ఫ్యూజన్ కు గురయ్యారు. కొడాలినాని స్థానికుడు కావడం, అవినాష్ స్థానికేతురడవ్వడాన్నికూడా వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. వ్యక్తిగతంగా ఉన్న తన ఇమేజ్ తో పాటుగా అవినాష్ ను అన్ని రకాలుగా ఇరకాటంలోకి నెట్టేందుకు కొడాలినాని చివర వరకూ ప్రయత్నించారంటున్నారు.ఇద్దరూ బలమైన అభ్యర్థులు కావడంతో ఈ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ జరిగిందంటున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు ఓటుకు రెండు వేల నుంచి మూడువేలు పంచినట్లు చెబుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు కలసి దాదాపుగా వందకోట్లకు పైగానే ఖర్చుచేశారంటున్నారు. పోటాపోటీగాఖర్చు చేయడంతో ఈ నియోజకవర్గంలో గెలుపోటములపై భారీగా బెట్టింగ్ లు సయితం జరుగుతున్నాయి. దేవినేని అవినాష్ సయితం తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. మొత్తం మీద గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి రంగా హత్య ఎన్నికల వేళ మరోసారి ప్రచారాస్త్రంగా మారడం విశేషం.