యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తమిళనాడులో భారీగా పట్టుబడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం బంగారంపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. టీటీడీకి రావాల్సిన బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇస్తున్నామని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 1381 కిలోల బంగారం తిరుపతికి తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఆధారాలు చూపించడంతో ఆ బంగారాన్ని టీటీడీకి అప్పగించారు. ఈ అంశంపై ఈవో మాట్లాడుతూ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ 2000 ఏప్రిల్ 1న ప్రారంభమైందని, ఎస్బీఐలో 5387 కిలోల బంగారం ఉందని చెప్పారు. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 18, 2016లో పీఎన్బీలో 1381 కిలోల బంగారం డిపాజిట్ చేసినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ 18, 2019 నాటికి అది మెచ్యూరిటీ అయ్యిందన్నారు. మెచ్యూరిటీ అంశంపై మార్చి 27నే పీఎన్బీకి లేఖ రాశామని, బంగారం తరలింపు బాధ్యత పూర్తిగా పీఎన్బీదేనని సింఘాల్ వెల్లడించారు.