యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
భగీరథ స్ఫూర్తిని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భగీరథ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. జేసి పఠాన్ శెట్టి రవి సుభాష్, నగరపాలక సంస్థ కమీషనర్ ప్రశాంతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా భగీరథ చిత్ర పటానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహానుభావుల జీవిత చరిత్రను , వారు చేసిన కృషిని నేటి తరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో భగీరత జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. భగీరథుడు మహా జ్ఞాని. ఎంత కష్టాన్నైయిన లెక్కచేయకుండా అనుకున్నది సాధించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అందుకని ఎవరైనా అనుకున్నది కష్టపడి సాధిస్తే వారిని భగీరథునితో పోలుస్తారని తెలిపారు. చితా భస్మం అయిన తన పూర్వీకులకు సద్గతి కలిగించేందుకు కఠోర తపస్సు చేసి పవిత్ర ఆకాశగంగను భువికి తీసుకువచ్చిన మహానుభావుడు భగీరథుడు అని కొనియాడారు. వీరిని ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకుని మనం, నేటి యువత తమ లక్ష్యాలను సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ ఈడి శిరీష, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి మయూరి, సీపీవో ఆనంద నాయక్, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఠాగూర్ నాయక్, డిఆర్డీఏ పీడి రామకృష్ణ, ప్రత్యేక ప్రతిభావంతుల శాఖ ఎడి భాస్కర్ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర రెడ్డి, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, బిసి కార్పొరేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, తదితర జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.