శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటక జేడీఎస్ నేతలు ఏడుగురు నేతలు మిస్సింగ్ అయ్యారు. వీరిలో నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదు. కర్ణాటకకు చెందిన ఇద్దరు చనిపోయినట్టు సోమవారం ఉదయం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. కొలంబోలోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ధ్రువీకరించింది. బాంబు పేలుళ్ల ఘటనలో మృతిచెందిన ఇద్దరు భారతీయులను కేజీ హనుమంతరాయప్ప, ఎం రంగప్పగా గుర్తించినట్టు కొలంబోలోని భారత హైకమిషనర్ కార్యాలయం తెలిపింది. జేడీఎస్ నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ట్విట్టర్ ద్వారా వారి వివరాలను కుమారస్వామి షేర్ చేశారు. లక్ష్మణ గౌడ రమేశ్, కేఎం లక్ష్మీనారాయణ, కేజీ హనుమంతరాయప్ప, ఎం రంగప్పలు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. జేడీఎస్‌కు చెందిన ఏడుగురు నేతలు ఎన్నికల ప్రచారం అనంతరం ఏప్రిల్ 20న శ్రీలంక వెళ్లారు. వీరు కొలొంబోలోని ద షాంగ్రిలా హోటల్‌లో విడిది చేసినట్లు తెలుస్తోంది. అదే చోట ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిగతా ముగ్గురు నేతల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 290కి చేరుకోగా, మరో 500మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. శ్రీలంకలోని ఆరు చోట్ల జరిగిన బాంబు దాడుల్లో ఏడుగురు మానవ బాంబులు పాల్గొన్నట్టు విచారణలో వెల్లడయ్యింది. మొత్తం ఏడుగురు ఫిదాయిలు ఈ దాడుల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్నవారి మృతదేహాలను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. షాంగ్రిలా హోటల్‌లో ఇద్దరు, మిగతా చోట్ల ఒక్కొక్క ఫిదాయి పాల్గొన్నట్టు తెలిపారు.