ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్నికలు రావడం నువ్వా…? నేనా…? అనే స్థాయిలో ప్రచారం తరువాత పోలింగ్ జరిగిపోయాయి. ఇప్పుడు మరో నెలరోజుల పాటు వేచి చూస్తే కానీ ఫలితాలు వచ్చే అవకాశం లేదు. అయినా కానీ ప్రధాన రాజకీయ పక్షాల్లో మాత్రం ఎన్నికల వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకుంటూనే వున్నాయి. అధికార టిడిపి పార్టీ, విపక్షం వైసిపి పార్టీల్లోని నేతలు ఇప్పుడు విమర్శలు, ఆరోపణలు బహిరంగ లేఖల పేరుతో విడుదల చేస్తూ సొంత పార్టీ మీడియా లలో విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. దీనిపై షోషల్ మీడియా లో విస్తృత చర్చ సాగుతుంది. పోలింగ్ పూర్తి అయ్యేవరకు ఈ లేఖల యుద్ధం కొనసాగే పరిస్థితి కొనసాగేలానే వుంది.జగన్ పై తమ పార్టీ నేతలపై మాటలు తూటాలు పేలుస్తునే మరోపక్క లేఖల అస్థ్రాలను సంధిస్తోంది టిడిపి. ముఖ్యంగా టిడిపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకటరావు జగన్ టార్గెట్ గా లేఖలు విడుదల చేసే పనిలో యామ బిజీ అయిపోయారు. ఒక పక్క తమ సర్కార్ ఆపద్ధర్మ ప్రభుత్వం కాదంటూనే రాబోయేది తమ ప్రభుత్వమే అని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క వైసిపి అటు ఎన్నికల సంఘానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సారధ్యంలో ఫిర్యాదుల పరంపర నడుస్తూనే వుంది.సర్కార్ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ విజయసాయి కంప్లైంట్స్ సాగుతుంటే మరోపక్క వైసిపి మౌత్ పీస్ లు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ బాబు సర్కార్ పై సెటైర్లు విసురుతూ ఎన్నికల ముందు ఎలాంటి వేడి ఉందో అది చల్లారకుండా చూస్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకునే వీలులేదంటున్నారు. కానీ అభివృద్ధి పనులను మళ్లీ జగన్ అడ్డుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి ఈ లేఖల వార్, మాటల యుద్ధానికి తెరపడాలంటే ఇంకా నెలరోజులు పాటు వేచి వుండాలిసిందే