YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేన ఆఫీసులు ఖాళీ..... ఆందోళనలో కేడర్

జనసేన ఆఫీసులు ఖాళీ..... ఆందోళనలో కేడర్
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ, వైసీపీ సీట్ల లెక్కల్లో బిజీగా ఉన్నాయి. ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే స్థానాల్లో గెలుస్తాం? అని విశ్లేషించుకుంటున్నారు నేతలు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏపీలో పోలింగ్ ముగిశాక..జనసేన సైలెంట్‌గా ఉంది. టీడీపీ, వైసీపీ తరహాలో ఏపీ రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థులతో సోమవారం పవన్ సమావేశమవడం తప్ప  జనసేనలో  ఎలాంటి కార్యకలాపాలు లేవు.  అంతేకాదు ఎన్నిక‌లు ముగిసిన వారం రోజుల్లోనే ఇరు రాష్ట్రాల్లో పార్టీ కార్య‌ల‌యాలు ఖాళీ చేయడం ఒక్క‌సారిగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.జనసేన పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హారించిన నేత‌లు సైతం ఒక్కొక్క‌రిగా పార్టీకి దూర‌మ‌వుతున్నారు. ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా కొద్ది రోజుల ముందు విజ‌య‌బాబు పార్టీకి రాజీనామా చేస్తే.. ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత  అద్దేప‌ల్లి శ్రీధ‌ర్ పార్టీ వ్య‌వహారాల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం హాట్‌టాపిక్‌గా మారింది.  ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ గొంతుకను వినిపించిన ఆయనే పార్టీకి దూరంగా ఉండడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్ప‌టికే పార్టీ కార్యాలయాలకు టులెట్ బోర్డులు పెట్టడం..దీనికి తోడు నేతలు వరుసగా పార్టీని వీడుతుండడంతో కింది స్థాయి పార్టీ శ్రేణులు గంద‌ర‌గోళంలో ఉన్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా ఏపీలో జనసేన పోటీ మంచి ఫ‌లితాలు ఇస్తుందని పార్టీ కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. కానీ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌ర్వేల ప్ర‌కారం పార్టీకి 2 నుంచి 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొనే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే గెలిచిన త‌రువాత ఏ పార్టీకి మ‌ద్ద‌తు తెల‌పాల‌న్న అంశంపైనా ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ అధినేత‌ పవన్ కళ్యాణ్‌లో ఒక స్ప‌ష్టత లేక‌పోవ‌డంతో పార్టీ శ్రేణులు త‌ల‌ప‌ట్టుకుంటున్నాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ తీరు కూడా నేత‌ల‌ను విస్తుపోయేలా చేస్తోంది. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ప‌వ‌న్ పార్టీ వ్య‌వ‌హారాల‌పై పెద్ద‌గా శ్ర‌ద్ద చూప‌డంలేద‌నే వాదన‌లు పార్టీలో ఎక్కువ‌వుతున్నాయి.మరోవైపు పవన్ కళ్యాణ్ ఓ మూవీకి ప్రిపేర్ అవుతున్నార‌నే స‌మాచారంతో నేత‌లు మ‌రింత డీలా ప‌డిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళ‌న‌లో ఉన్నారు నేత‌లు. ఇక క్షేత్ర స్థాయిలో కేడ‌రే లేని తెలంగాణ‌లో లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నామ‌ని నేత‌ల‌కు ప‌వ‌న్ చెప్ప‌డంతో మ‌రింత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు కార్యకర్తలు. పొంత‌న లేని నిర్ణ‌యాల‌తో నేత‌లు త‌మ గోడు ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క నానా తంటాలు ప‌డుతున్నారు. ఎన్నికల ఫలితాల తరవాత జనసేన పరిస్థితి ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుంది.

Related Posts