YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నేతలే కలిశారు... కేడర్ కలవ లేదు

నేతలే కలిశారు... కేడర్ కలవ లేదు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ములాయం సింగ్ యాదవ్… ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీని మూలాల నుంచి పటిష్టపర్చిన నేత. ఒక సామాజిక వర్గ నేతగా పార్టీని పెట్టినా అందరినీ కలుపుకుని వెళ్లి సక్సెస్ అయ్యారు. జాతీయ నేతగా ఆవిర్భవించారు. ప్రధాన పదవి రేసులోనూ ఆయన పేరు పలుమార్లు విన్పించింది. చివరకు పార్టీని కుమారుడు అఖిలేష్ యాదవ్ చేతుల్లో పెట్టి రాజకీయంగా ఉన్నా ఒకరకంగా విశ్రాంతి తీసకుంటున్నట్లే. మాయావతి. కాన్షీరామ్ ప్రారంభించిన ఈ పార్టీని ఆయన తదనంతరం పటిష్టంగా మలిచారు. జాతీయ స్థాయి నేతగా గుర్తింపు పొందడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ప్రధాని రేసులో మొదటి పేరు విన్పించేది మాయావతిదే.ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు దాదాపు 24 ఏళ్ల నుంచి బద్ధవైరంతో ఉండేవి. బీఎస్పీ, ఎస్పీలు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసి యూపీలో జీరోను చేశాయి. అధికారంలోకి వస్తే బీఎస్పీ లేదా సమాజ్ వాదీ పార్టీ అన్న ట్రాక్ రికార్డును రెండు పార్టీలు సృష్టించాయి. అయితే కాలం ఒకేలా ఉండదు కదా. జాతీయ పార్టీ అయిన బీజేపీ యూపీలో దూసుకు వచ్చింది. గత లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు ప్రాంతీయ పార్టీలనూ చిత్తుచిత్తుగా ఓడించింది. వాటి మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా బీజేపీ వ్యవహరిస్తోంది. మాయావతి, అఖిలేష్ యాదవ్ లు ఒక్కటయి ఈ లోక్ సభ ఎన్నికల్లో పొత్తులతో బరిలోకి దిగారు. అయితే ములాయం సింగ్ యాదవ్, మాయావతిలు గత 24 ఏళ్లుగా కలిసింది లేదు. మాట్లాడుకుంది లేదు. వారి మధ్య బద్ధ వైరం పెరగడానికి బలమైన కారణమూ ఉంది. 1995లో బీఎస్సీ, ఎస్పీ సంకీర్ణ ప్రభుత్వం ఉండేది. అయితే అప్పట్లో కాన్షీరాం ఎస్పీకి మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో అప్పటి బీఎస్పీ నేత మాయావతి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మద్దతుదారులు గెస్ట్ హౌస్ మీద పడి ఎమ్మెల్యేలను చితకబాదారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత బీఎస్పీ మద్దతు ఉప సంహరించుకుంది. దీంతో ములాయం సింగ్ సర్కార్ దిగిపోవాల్సి వచ్చింది. బీజేపీ, జనతాదళ్ బయటనుంచి మద్దతివ్వడంతో మాయావతి ముఖ్యమంత్రి కాగలిగారు.అప్పటి నుంచి రగులుతున్న పగతో ఇప్పటి వరకూ మాయావతి, ములాయం సింగ్ లు కలుసుకోలేదు. 24 ఏళ్ల తర్వాత మెయిన్ పురి ఎన్నికల ప్రచార సభలో ఇద్దరూ ఒకే వేదికపై పాల్గొన్నారు. అయితే సభ జరిగిన తీరు చూస్తే ఎవరికి వారే తమ నేతలకు నినాదాలు చేయడం, మాయావతి, ములాయం ఒకరినొకరిపై పొగడ్తలు గుప్పించుకున్నా క్యాడర్ నుంచి అంత స్పందన లేదన్నది విశ్లేషకుల అంచనా. రెండు పార్టీలు కలవడం క్యాడర్ కు అస్సలు ఇష్టం లేనట్లు ఆ సభను పరిశీలించిన వారికి ఇట్టే తెలుస్తోంది. ఎన్నికల వేళ నేతలు ఏకమైనా పార్టీల క్యాడర్ మాత్రం కలిసేందుకు సుముఖత చూపడం లేదన్నది సుస్పష్టం.

Related Posts