యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చివరి నిమిషంలో పార్టీ మారిన గౌరు చరితా రెడ్డి మరోసారి విజయం సాధిస్తారా? ఆమెకు పాణ్యం ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నారా? గౌరు చరిత పార్టీ మారడంతో నష్టమా? లాభమా? ఇదే చర్చ ఇప్పుడు కర్నూలు జిల్లాలో జోరుగా సాగుతోంది. భారీ ఎత్తున ఈ నియోజకవర్గంపై బెట్టింగ్ లు కూడా మొదలయ్యాయి. అయితే ఇక్కడ పోటీ మాత్రం మామూలుగా లేదన్నది వాస్తవమే. అభ్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో గెలుపుపై ఇద్దరూ ధీమాగా ఉన్నారు.గౌరు చరితారెడ్డి అంటేనే వైఎస్ గుర్తుకొస్తారు. గౌరు కుటుంబాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతగా అక్కున చేర్చుకున్నారు. అందుకే వైఎస్ మీద అభిమానంతో ఆ కుటుంబం కాంగ్రెస్ ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. పాణ్యం నియోజకవర్గంలో పార్టీల కంటే వ్యక్తుల ఇమేజ్ గొప్ప అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే గౌరుకుటుంబానికి వైసీపీ టిక్కెట్ దక్కదని తెలియడంతో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ కండువాను కప్పేసుకున్నారు. పాణ్యం టీడీపీ అభ్యర్థిగా గౌరు చరిత బరిలోకి దిగారు.గౌరు చరిత చివరకు తన ప్రచారంలోనూ జగన్ ను మర్చిపోలేదు. జై జగన్ అని ప్రచారంలో నినాదం చేసి నాలుక్కరుచుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్టీ మారినా జగన్ ను పెద్దగా విమర్శించకపోవడం ఇక్కడ గమనార్హం. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీకి మంచి పట్టుంది. అందుకే గత ఎన్నికల్లో పన్నెండు వేల మెజారిటీతో గౌరు చరిత గెలుపొందారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డికి దాదాపు 60వేలు ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు. అంటే ఇక్కడ టీడీపీ బలం పెద్దగా చెప్పనక్కరలేదు.కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఖచ్చితంగా గెలుస్తారన్న సర్వే నివేదికలతోనే జగన్ టిక్కెట్ ఇచ్చారన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. కాటసాని ఎన్నికల అనంతరం కూడా అదే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే పాణ్యం నియోజకవర్గంలో ఐదుసార్లు గెలిచిన కాటసానికి మరోసారి పాణ్యం ప్రజలు పట్టం కడతారన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాటసాని గెలుపునకు మరింత సులువయిందంటున్నారు. గౌరు చరిత పార్టీ మారినా ఈసారి పాణ్యం నుంచి గట్టెక్కడం కష్టమేనంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.