యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంత్రి శిద్దా రాఘవరావు. మంచితనానికి, నాన్ కాంట్రవర్సీలకు కూడా ఆయనే కేరాఫ్ అంటారు ఆయనను దగ్గరగా చూసిన చాలా మంది. అయితే, ఐదేళ్ల కాలంలో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడం, టీడీపీని వ్యతిరేకించే వారు సైతం శిద్దాపై సానుభూతి చూపించడం వంటివి చూస్తే.. నిజంగానే ఆయన మంచి వాడని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆయనకు రాజకీయంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును దైవంగా భావించే మంత్రి శిద్దా.. ఏనాడూ బాబు మాటను వ్యతిరేకించలేదు. ఏనాడూ పార్టీ లైన్‌ను విభేదించి ఒక్క పనీ చేయలేదు. ఇదే ఆయనకు మైనస్‌గా మారిందని అంటున్నారు విశ్లేషకులు.తాజా ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు టికెట్‌పై టీడీపీ తరఫున పోటీ చేశారు మంత్రి శిద్దా. అయితే, మొదట్లో ఆయనకు అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాలు ఎన్నికల పోలింగ్ సమయానికి వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించారు. గత ఎన్నికల్లో శిద్ధా దర్శి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. దీంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇక, మంత్రిగా కూడా ఆయన దూకుడు ప్రదర్శించారు. నియోజకవర్గంతోపాటు జిల్లాలోని సమస్యలపైనా ఆయన దృష్టి పెట్టివాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే దర్శి నుంచే పోటీ చేయాలని అన్నీ సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ వేసే సమయానికి రాత్రికి రాత్రి మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు హ్యాండివ్వడంతో ఒంగోలు ఎంపీ స్థానం నుంచి శిద్దాను నిలబెట్టారు బాబు.నిజానికి దర్శి నియోజకవర్గం రాజకీయాలకు ఒంగోలు పార్లమెంటు రాజకీయాలకు చాలా భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ అనేక వర్గాలు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. దాదాపు ఏడు నియోజకవర్గాల్లో విస్తరించిన ఒంగోలు పార్లమెంటులో వైసీపీ సానుభూతి పవనాలు బాగానే వీచాయి. అదేసమయంలో టీడీపీలోనే అంతర్గత కుమ్ములాటలు, కమ్మవర్గాన్ని వ్యతిరేకించే వారు పెరిగారు. దీనిని గమనించే మాగుంట పార్టీ మారిపోయారు. ఇక, శిద్దాకు ఇక్కడ సమన్వయం అంతగా కుదరలేదనే అంటున్నారు. చంద్రబాబు వచ్చి రెండు సార్లు సభలు నిర్వహించినా.. పార్టీలోని అంతర్గత పోరును తగ్గించే ప్రయత్నం మాత్రం సానుకూలం కాలేదు. దీంతో ఒకటి రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలత ఉన్నా.. దాదాపు 4 నియోజకవర్గాలలో టీడీపీకి ఉన్న వ్యతిరేకత శిద్దాపై ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి బాబును నమ్మి శిద్దా నిండా మునిగారని ఆయన వర్గీయులు బాహాటంగానే చెబుతున్నారు.