యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర విభజన దెబ్బకు కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీల్లాంటి నేతలు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కున్నారు. కర్నూలు జిల్లాలోని సీనియర్ నేత కోట్ల కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం ఉన్న కోట్ల కుటుంబం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరింది. వీరి రాకతో కర్నూలు జిల్లాలో బలపడ్డామని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇక, కాంగ్రెస్ లో భవిష్యత్ లేనందున ఇన్నేళ్లుగా ప్రత్యర్థి పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరి అయినా రాజకీయంగా పునర్వైభవం దక్కించుకోవాలని కోట్ల కుటుంబం భావించింది. మొత్తానికి టీడీపీలో చేరి డిమాండ్లను సాధించుకున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు ఎంపీ టిక్కెట్ తో పాటు ఆయన భార్య కోట్ల సుజాతమ్మకు ఆలూరు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కింది.కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించింది. అయితే, ఈసారి జిల్లాలో వైసీపీ కంటే ఎక్కువ సీట్లు గెలవాలని టీడీపీ భావిస్తోంది. కోట్ల కుటుంబంపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఆలూరు నియోజకవర్గంలో కోట్ల కుటుంబానికి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గుమ్మనూరి జయరామ్ పోటీ చేసి సుమారు 2 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విరభద్రగౌడ్ పై విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోట్ల సుజాతమ్మ 22 వేల ఓట్లు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకున్న కొంత మందిలో సుజాతమ్మ ఒకరు. ఈసారి తెలుగుదేశం పార్టీ బలానికి కోట్ల కుటుంబ బలం తోడవడంతో ఆమె విజయం ఖాయమని టీడీపీ భావిస్తోంది.ఈసారి వైసీపీ, టీడీపీ మధ్య ఆలూరులో హోరాహోరీ పోరు జరిగింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జయరామ్ మరోసారి పోటీ చేశారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడ్డారు. కోట్ల సుజాతమ్మ వచ్చే వరకు జయరామ్ గెలుస్తారనే అంచనాలు ఉన్నా ఆమె పోటీలోకి వచ్చిన తర్వాత ఆయనకు పోటీ తీవ్రమైంది. కోట్ల కుటుంబానికి ముందునుంచీ ఆలూరులో మంచి పట్టుంది. ఇక, టీడీపీ క్యాడర్ కూడా ఆమెకు పూర్తి మద్దతిచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన విరభద్రగౌడ్ కూడా సుజాతమ్మకు మద్దతుగా పనిచేశారు. వ్యక్తిగతంగా సుమారు 20 వేల ఓటు బ్యాంకు ఉన్న సుజాతమ్మకు ఈసారి టీడీపీ ఓటు బ్యాంకు కూడా తొడవడంతో నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా పరిస్థితి మారింది. మొత్తానికి, ఆలూరులో మళ్లీ గెలవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టంగానే ఉంది.