Highlights
- శ్రీదేవి మృతిలో చిక్కుప్రశ్నలు..!
- ఇంకా వీడని సందేహాలు
- వివాదాస్పద వాదనలు
- పీటముడి విప్పేదెవరు
రెండున్నర రోజుల హైడ్రామా తర్వాత మొత్తానికి శ్రీదేవి మృతి కేసును మూసేశారు దుబాయ్ పోలీసులు. దాదాపు 60 గంటల పాటు ఎన్నో మలుపుల మధ్య ఎంతో ఉత్కంఠ రేపిన ఈ కేసులో విచారణ మొత్తం పూర్తయినట్లు పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఈ ప్రమాదవశాత్తు మృతి కేసును మూసేస్తున్నట్లు ప్రకటించారు.
శ్రీదేవి గుండెపోటు వల్ల కాదు, నీటమునగడం వల్ల చనిపోయిందని తెలియగానే, ఈ వ్యవహారమంతా గందరగోళంగా మారిపోయి, చిక్కుముళ్లతో అల్లుకుపోయింది. చాలా ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. ఇవన్నీ కూడా జవాబులకోసం భర్త బోనీకపూర్ వైపే చూస్తున్నాయి.
ఇంకా వీడని సందేహాలుః
1. అసలేం జరిగింది? - బోనీకపూర్ స్పృహతప్పిన స్థితిలో శ్రీదేవిని చూసి, పోలీసులకు సమాచారమిచ్చిన సమయంలో ఏం జరిగింది?
2. శ్రీదేవి ఖచ్చితంగా ఎన్ని గంటలకు మరణించింది?
3. లోపలివైపు గడియపెట్టిఉన్న బాత్‌రూం తలుపులను బోనీ ఎలా తెరవగలిగారు?
4. బాత్‌టబ్ నిండిఉంది - పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, నిండా నీరు ఉన్న టబ్‌లో శ్రీదేవి కనిపించిదని గల్ఫ్‌న్యూస్ పత్రిక తెలిపింది. డెత్ సర్టిఫికేట్‌లో అనుకోకుండా మునిగి చనిపోయిందని రాసుంది. మరి బాత్‌రూంలోకి శ్రీదేవి వెళ్లకముందే టబ్‌లో నీళ్లు ఎవరు నింపారు?
5. దెబ్బలేవి - స్పృహకోల్పోయిన స్థితిలో ఆమె టబ్‌లో కుప్పకూలిపోయిఉంటే, ఖచ్చితంగా తలపై, శరీరంపై గాయాలు, మరకలు కనిపించాలి. మరి అవి ఉన్నాయా.?
6. బోనీకపూర్ పెళ్లయిన వెంటనే కూతురుని తీసుకుని ముంబయికి ఎందుకు వచ్చాడు? మళ్లీ ఒక్కరోజులోనే శ్రీదేవిని ఆశ్యర్యపరచడానికి ఎందుకు వెళ్లాడు?
7. మద్యం ఆనవాళ్లున్నాయన్నప్పుడు, ఎంత తాగితే, తనమీద తనకు నియంత్రణ కోల్పోయి టబ్‌లో పడిపోయిఉంటుంది? శ్రీదేవి కుటుంబ సన్నిహితుడు అమర్‌సింగ్, బిజెపి నేత సుబ్రమణ్యస్వామి చెప్పిందాని ప్రకారం, ఆమెకు మద్యం సేవించే అలవాటు లేదు. ఎప్పుడైనా కొద్దిమోతాదులో వైన్ గానీ, బీర్ గానీ సేవించేది. మరలాంటప్పుడు ఇదెలా సాధ్యం?
వివాదాస్పద వాదనలుః
దుబాయ్‌లోని మీడియా కథనాలు చాలా వివాదాస్పద వాదనలను లేవనెత్తుతున్నాయి. వాటి ప్రకారం, శ్రీదేవి చెల్లి శ్రీలత కూడా పెళ్లికి వచ్చింది. తనతో గడిపేందుకే బోనీతో ముంబయికి వెళ్లకుండా దుబాయ్‌లోనే ఉండిపోయింది. కానీ మీడియా చెపుతున్నదాని ప్రకారం, అంతకుముందు 48 గంటలనుంచీ శ్రీదేవి హోటల్ గదిలోనుండి బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది ఒకరు, భారత పత్రిక మిడ్-డేకు తెలిపిందేమిటంటే, ఆ రోజు రాత్రి 10.30 గంటలకు శ్రీదేవి మంచినీళ్లు ఆర్డర్ చేసిందనీ, తాను తీసుకెళ్లి ఎన్నిసార్లు డోర్‌బెల్ కొట్టినా, తలుపు తెరవలేదన్నాడు. దాంతో ఆందోళనకు గురైన బాయ్, అలారం మోగించగా వచ్చిన సిబ్బంది, తలుపులు బద్దలుకొట్టి చూడగా బాత్‌రూంగదిలో నేలపై శ్రీదేవి పడిపోయిఉందనీ, అప్పటికి నాడి ఇంకా కొట్టుకుంటూనేఉందని తెలిపాడు. అప్పుడు టైం 11గంటలైందని కూడా చెప్పాడు. వెంటనే వాళ్లు పక్కనే ఉన్న రషీద్ హాస్పిటల్‌కు తరలించగా, ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పినట్లు ఈ హోటల్ బాయ్ మిడ్‌డే కు చెప్పాడు. ఇదంతా జరిగినప్పుడు శ్రీదేవి ఒంటిరిగా ఉందని చెప్పడం గమనార్హం.
శనివారం సాయంత్రం 5 గంటలకు హోటల్‌కు చేరుకున్న బోనీకపూర్, కాసేపు భార్యతో మాట్లాడి, డిన్నర్ వెళ్దామనగా, ఫ్రెషప్ అయి వస్తానని బాత్‌రూంలోకి వెళ్లిన శ్రీదేవి పావుగంటైనా రాకపోయేసరికి, బాత్‌రూం తలుపులు బలవంతంగా తెరిచి చూసాడు. అప్పటికే టబ్‌లో మునిగిపోయిఉన్న ఆమెకు బయటకు తీయడానికి ప్రయత్నించి, వీలుకాక, ఒక స్నేహితుడి పిలిచాడు. ఇది జరిగినప్పుడు సమయం 6 గంటలు. వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చిన టైం 9 గంటలు. మరి మధ్యలోని మూడు గంటలు ఏం జరిగిందన్నది ఇంకా విప్పని పీటముడి.