యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మంగళవారం జరిగింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాడింది. . మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 14 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. గుజరాత్(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్గఢ్(7), ఒడిశా(6), బిహార్ (5), బెంగాల్(5), గోవా(2), దాద్రనగర్ హవేలీ, డామన్డయ్యూ, త్రిపురలో చెరో స్థానానికి మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 14 రాష్ట్రాల్లో మొత్తం 2.10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటుచేసింది.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భువనేశ్వర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన తన ఓటును వేశారు. ములాయం సింగ్ సోదరుడు అభయ్ సింగ్ యాదవ్.. మణిపురి నియోజకవర్గంలోని సైఫైలో ఓటు వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటు వేశారు. అహ్మదాబాద్లోని నరన్పురా సబ్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన తన సతీమణి సొనాల్ షాతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పినరయి గ్రామంలో ఆర్సీ అమల బేసిక్ యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో కేరళ సీఎం ఓటు వేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణి అంజలితో కలిసి రాజ్కోట్లోని అనిల్ జ్ఞాన్ మందిర్ పాఠశాలలో ఓటు వేశారు. కేరళ గవర్నర్ పి. సదాశివం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, గొవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి సఖాలి నియోజకవర్గంలో ఓటు వేశారు.