యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుపతి గోవిందరాజస్వామి ఉప ఆలయం కిరీటాల అపహరణ కేసులో నిందితుడు ఆకాష్ ప్రతాప్‌ను అరెస్టు చేసినట్లు తిరుపతి ఎస్పీ అంబురాజన్ తెలిపారు. నిందితుడి అరెస్ట్‌ను ఎస్పీ మీడియా ద్వారా వెల్లడించారు. నిందితుడి స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖాందార్ తాలుకా. తన స్నేహితుడు విక్కితో కలిసి నిజామాబాద్ ప్రాంతంలో చోరీలకు పాల్పడేవాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సెల్‌ఫోన్ చోరీ కేసులో గతంలో ఇతడిని గతంలో అరెస్టు చేశారు. గత ఫిబ్రవరి 1వ తేదీ తిరుపతికి వచ్చి భక్తుడిలా గోవిందరాజస్వామి ఆలయంలో రెక్కి నిర్వహించాడు. మరుసటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో మకాం వేసి సాయంత్రం పూజారి అప్రమత్తంగా లేని సమయంలో మూడు కిరీటాలను నిందితుడు చోరీ చేసినట్లు వెల్లడించారు. ఆకాష్ ప్రతాప్ నుంచి 1300 గ్రాముల బంగారాన్ని, కిరీటాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.రెండు నెలల క్రితం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి గురైన మూడు కిరీటాలను రికవరీ చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితుడు చోరీ చేసిన 3 కిరీటాలను కరిగించి బంగారు కడ్డీలుగా మార్చాడని తెలిపారు. చోరీకి గురైన 3 కిరీటాల బరువు 1381 గ్రాములని, వాటి విలువ సుమారు రూ.42 లక్షల 35 వేలని చెప్పారు. చోరీ జరిగిన 80 రోజుల తర్వాత నిందితుడిని పట్టుకున్నట్లు వివరించారు.సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని పేర్కొన్నారు. నిందితుడు దొంగతనం చేశాక రేణిగుంట, కాచిగూడల్లో స్థానికంగా ఉన్న బంగారు వ్యాపారుల వద్ద అమ్మటానికి ప్రయత్నించి విఫలమయ్యాడని వివరించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరా, ఓ వైన్‌షాప్ వద్ద ఉన్న సీసీ కెమెరా అనంతరం రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో నిందితుడు కనపడ్డానని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుడి కదలికల ఆధారంగా వివిధ ప్రాంతాలకు టీంలను పంపించినట్లు వివరించారు