ఒక గొప్ప అవకాశం వచ్చినపుడు వాడుకోవాలి. లేకపోతే జీవితంలో మళ్లీ అలాంటి అవకాశం రాకపోవచ్చు. ఇపుడు మోడీ... అమిత్ షాల పరిస్థితి ఇదే. అసలు ఈకాలంలో ప్రాంతీయ భావనలు భారీగా ఉన్న నేపథ్యంలో ఒకే పార్టీకి ప్రజలు సంపూర్ణ మెజారిటీని ఇవ్వడమే ఒక మహా అద్భుతం. అలాంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మోడీ కచ్చితంగా ఫెయిలయ్యారు. అందుకే మరోసారి ఏ పార్టీకి దేశ ప్రజలు ఆ అవకాశాన్ని ఇవ్వరు. ఎందుకంటే వారు ఈ వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయారు. ఇష్టాను సారం నిర్ణయాలు.. కుటుంబం లేని మోడీయే ఇంత నిరంకుశంగా, అహంకారంగా పరిపాలన సాగిస్తే... ఇక ఎవరైనా ఇంతే అనే నిర్ణయానికి జనం వచ్చేశారు. అందుకే సంపూర్ణ మెజారిటీ అనేది కల.
అయితే, మోడీ - షాలు ప్రజలు ఇచ్చిన వరాన్ని అక్రమమార్గంలో పార్టీని ఆయా రాష్ట్రాల్లో అధికారానికి తేవడానికి తప్ప మరి ఇంక దేనికీ సద్వినియోగం చేసుకోలేక పోయారు. అందుకే ఈస్థాయిలో మోడీ గెలుపు కోసం వ్యవస్థలను మేనేజ్ చేయాల్సి వస్తోంది. ఎన్ని చేసిన ఇప్పటికీ సంపూర్ణ మెజారిటీ రాదు. అందుకే హిందుత్వ అంశాన్ని రెచ్చగొట్టి మరోసారి ఓట్లు అడుగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ స్థానంలో ఎవరైనా బలమైన ప్రత్యర్థి ఉండి ఉంటే.. మోడీ కచ్చితంగా మళ్లీ వంద సీట్ల లోపుకు పడిపోయేవారు. రాహుల్ గాంధీయే మోడీ బలం అన్నట్టుంది. ఇప్పటికి రాహుల్ చాలా మెరుగుపడినా... మోడీలాగా ఇంటర్వ్యూలను అవాయిడ్ చేయకపోవడంతో పాపం చాలాసార్లు దొరికిపోతున్నారు. అయితే, ఇప్పటికే రాహుల్ ను సామాన్యుల్లో చాలామంది ఆమోదిస్తున్నారు.
ఇదిలా ఉంటే... మోడీ కి మంచి మెజారిటీ రావొద్దు... హంగ్ రావాలి అని ఆ పార్టీ నేతలే కోరుకుంటున్నారు. బీజేపీ తన సహజ తీరుకు విరుద్ధంగా మోడీ అనే వ్యక్తిస్వామ్యంతో ముందుకు సాగడం బీజేపీ నిజమైన అభిమానులకు నచ్చలేదు. వాస్తవానికి బీజేపీ నేతలు అంటే మంచి విద్యావంతులు ఉంటారు. అలాంటిది ఇద్దరు అవిద్యావంతులు ఇపుడు బీజేపీని ఏలుతున్నారు. అందుకే సీనియర్ నేతలకు విలువ లేదు పార్టీలో. అద్వానీ వంటి వారికే ఎంత అవమానం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, సంపూర్ణ మెజారిటీ వల్ల సీనియర్లు పార్టీలో నోరు మెదపలేదు. కానీ ఈ సారి తమ పార్టీకే మెజారిటీ రావాలి గాని సొంతంగా గెలవొద్దని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. వేరే పార్టీలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావాలని వారి కోరిక. అపుడు మోడీషాల పొగరు తగ్గి... ఇతరులు వారి కళ్లకు కనిపిస్తారన్నది పార్టీ సీనియర్ల అభిలాష.