YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఎన్నికల ఫలితాలు పై ఎడతెగని సస్పెన్స్

 ఏపీ ఎన్నికల ఫలితాలు పై ఎడతెగని సస్పెన్స్
ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎలా ఉండబోతున్నాయా ? అన్న అసక్తి సహజంగానే అందరిలోనూ ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో మరో నెల రోజులకు పైగా సమయం ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఆ నియోజకవర్గాల్లో రాజకీయ అసక్తి ఉన్న ఓటర్లు, నియోజకవర్గ ప్రజలు తుది ఫలితాలపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో బాగా అసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం ఒకటి. ఉభయగోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు, పశ్చిమగోదావరి జిల్లా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వైసీపీ గతంలో ఏ రాజకీయ పార్టీ చెయ్యని ప్రయోగానికి భిన్నంగా ఇక్కడ నుంచి బీసీలో గౌడ సామాజికవర్గానికి చెందిన యువకుడు మార్గాని భరత్‌రాంను రంగంలోకి దింపింది. రియల్ ఎస్టేట్‌ వ్యాపారంతో అనుబంధం ఉండడంతో పాటు గతంలో ఒకటి, రెండు టాలివుడ్‌ సినిమాల్లో నటించిన భరత్‌రాం ఏడాది కాలంగానే ఇక్కడ వర్క్‌ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు.ఇక టీడీపీ తన అభ్యర్థిగా టాలీవుడ్‌ సీనియర్‌ హీరో, సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ కోడలు మాగంటి రూపా దేవికి సీటు ఖరారు చెయ్యగా జనసేన నుంచి నిన్నటి వరకు రాజమహేంద్రవరం సిటీ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణ బరిలో ఉన్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే టీడీపీ కమ్మ సామాజికవర్గం, జనసేన కాపు సామాజికవర్గానికి సీట్లు ఇవ్వగా వైసీపీ మాత్రం బీసీ అభ్యర్థిని పోటీకి దింపింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రధాన పార్టీలు ఈ లోక్‌సభ సీటును కొన్ని సామాజికవర్గాలకే కేటాయిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు అందుకు భిన్నంగా వైసీపీ ఇక్కడ ఎత్తుగడ వేసింది. పోలింగ్‌ ముగిశాక మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే జరిగింది. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో అందరి అంచనాలకు భిన్నంగా ముగ్గురు అభ్యర్థులకు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా క్రాస్‌ ఓటింగ్‌ జరగడంతో ఎవరు ? గెలుస్తారన్నది ఎవరి అంచనాలకు అంతుపట్టడం లేదు. ఇక్కడ ఎవరు గెలిచినా గ‌తంలోలా లక్షల్లో మెజారిటీ ఉండే అవకాశం లేదు, 50 వేలకు అన్నా తక్కువ. ఇంకా చెప్పాలంటే 15 నుంచి 25 వేల మధ్యలోనే విజేత మెజారిటీ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.గెలుపు ఓటముల సంగతి ఎలా ? ఉన్నా వైసీపీ ఇక్కడ ప్రయోగించిన బీసీ అస్త్రంతో చాలా వరకు సక్సెస్‌ అయ్యింది. అయితే ఈ అస్త్రం వైసీపీ గెలుపుకు సహకరిస్తుందా ? లేదా టీడీపీ మెజారిటీ తగ్గిస్తుందా ? అన్నది మాత్రం సస్పెన్సే. గత ఎన్నికల్లో మురళీ మోహన్‌ ఇక్కడ నుంచి 1.57 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ సారి ఎవరు గెలిచినా పోటీ మాత్రం హోరా హోరీగానే ఉంది. ఈ ఎంపీ సీటును ఖ‌చ్చితంగా గెలిచి తీరుతామన్న వైసీపీ తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, రాజానగరం సెగ్మెంట్ల నుంచి తమకు భారీ మెజారిటీ వస్తుందన్న ధీమాతో ఉంది. పోలింగ్‌ సరళిని బట్టి ఈ రెండు సీట్లలో వైసీపీకే ఎడ్జ్‌ కనపడుతోంది. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు సీటు సైతం తమ ఖాతాలోనే పడుతుందని భావిస్తున్న వైసీపీ కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలు కూడా తమకే అని లెక్కల్లో ఉంది. రాజమండ్రి సిటీపై వైసీపీకి పెద్దగా ఆశలు లేకపోయినా రూరల్‌పై కొద్దో గొప్పో ఆశ ఉంది. ఓవర్‌ ఆల్‌గా ఐదు సీట్లలో కచ్చితంగా గెలుస్తామని ఆరో సీటు సైతం గెలిచే ఛాన్స్‌ ఉందని 50,000 పై చిలుకు మెజారిటీతో ఎంపీ సీటు తమ ఖాతాలోనే పడుతుంది వైసీపీ లెక్కల్లో మునిగి తేలుతోంది.టీడీపీ రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్‌ సీట్లతో పాటు కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలను భారీ మెజారిటీతో గెలుచుకుంటామని నిడదవోలులో టైట్‌ ఫైట్‌ జరిగినా చివరి క్షణంలో బయట పడ్డామంటోంది. ఓవరాల్‌గా ఐదు సీట్లతో పాటు ఎంపీ సీటు గెలుచుకుంటామని ఫుల్ ధీమాతో ఉంది. ఇక జనసేన ఏ అసెంబ్లీ సీటు గెలుచుకుంటామన్నది ఖ‌చ్చితంగా చెప్పకపోయినా రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీలో టైట్‌ ఫైట్‌ ఇచ్చామని ఏడు నియోజకవర్గాల పరిధిలో జరిగిన క్రాస్‌ ఓటింగ్‌ తమను గట్టెక్కిస్తుందని భావిస్తోంది. ఇక క్రాస్‌ ఓటింగ్‌ విషయానికి వస్తే సామాజికవర్గాల వారీగా కొన్ని చోట్ల మూడు పార్టీలకు ఓట్లు పోలైనట్టు గ్రౌండ్‌ రిపోర్ట్‌ చెబుతోంది. రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్‌లో వైసీపీ నుంచి పోటీ చేసిన కాపు అభ్యర్థులకు ఓట్లు వేసిన ఆ సామాజికవర్గం ఓటర్లు ఎంపీకి జనసేనకు వేసినట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా నిదడవోలులోనూ ఇదే పరిస్థితి పున‌రావృతం అయినట్టు తెలుస్తోంది. ఇక గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు టీడీపీకి ఓట్లు వెయ్యడం ఇష్టంలేని టీడీపీ సానుభూతి పరులు ఎంపీకి మాత్రం మాగంటి రూపకే ఓటు వేశారని అంటున్నారు. అనపర్తిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్న టీడీపీ శ్రేణులు ఎంపీకి మాత్రం టీడీపీకి క్రాస్‌ ఓట్‌ చేసినట్టు సమాచారం. ఇక సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేకు టీడీపీకి ఓటు వేసిన ఓ సామాజిక‌వ‌ర్గం వారు ఎంపీకి త‌మ వ‌ర్గం వాడే అని వైసీపీ అభ్యర్థికి ఓట్లు వేసిన‌ట్టు కూడా కొంద‌రు చెప్పారు. ఏదేమైనా మూడు పార్టీల అభ్యర్థులకు క్రాస్‌ ఓట్లు పడ్డాయి. మరి తుది ఫలితంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాల్సి ఉంది.

Related Posts