గన్నవరం విమానాశ్రయం ప్రయాణికుల వృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. మరే విమానాశ్రయానికీ సాధ్యంకాని రీతిలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. 2018-19 ఆర్థిక ఏడాదిలో 9లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే.. అంచనాలను సైతం తారుమారు చేస్తూ.. అనూహ్యంగా 11.91లక్షలు దాటారు. విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులతో పాటూ.. దేశంలోని తొమ్మిది నగరాల నుంచి ఇక్కడికి వచ్చేవారు సైతం అత్యధికంగానే ఉన్నారు. ఈ ఏడాది 6.15వేల మంది ఇతర నగరాల నుంచి విజయవాడకు చేరుకోగా.. ఇక్కడి నుంచి 5.75లక్షల మంది వెళ్లారు. ప్రస్తుతం రోజుకు 3264మంది, నెలకు 99,287మంది ప్రయాణికులు గన్నవరం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. విమానాశ్రయం నుంచి ఏ నగరానికి నూతన సర్వీసులు ఆరంభమైనా.. 80శాతం పైగా ఆక్యుపెన్షీతో నడుస్తున్నాయి.
గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు గత డిసెంబర్ నుంచి ఆరంభమయ్యాయి. సింగపూర్‌కు సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుంచి విజయవాడకు వస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులు సైతం తోడవ్వడంతో.. మరింత వృద్ధి నమోదవుతోంది. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ అంతర్జాతీయ ప్రయాణికులు 6254మంది రాకపోకలు సాగించారు. ఇప్పటివరకూ డిసెంబర్ నుంచి 68 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాయి. దుబాయికి సైతం సర్వీసులను ఆరంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇవి ఫలిస్తే.. వచ్చే ఏడాది మరింత ప్రయాణికుల వృద్ధి సాధించనుంది.
దేశంలోని తొమ్మిది నగరాలకు ప్రస్తుతం గన్నవరం నుంచి 58 సర్వీసులు రోజూ నడుస్తున్నాయి. ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిరిండియా, ట్రూజెట్.. నాలుగు విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి సేవలు అందిస్తున్నాయి. నెలకు 1764 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 2018-19లో మొత్తం 21,169 విమాన సర్వీసులు నడిచాయి. వీటిలో బయట నగరాల నుంచి విజయవాడకు వచ్చిన సర్వీసులు 10,587 ఉన్నాయి. విజయవాడ నుంచి ఇతర నగరాలకు 10,582 సర్వీసులు నడిచాయి. 2019-20 ఆర్థిక ఏడాదిలో విమాన సర్వీసులు, ప్రయాణికుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రయాణికుల సంఖ్య కనీసం 15 లక్షలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు.