ఒకప్పుడు జలకళతో మెరిసిపోయిన స్వర్ణముఖి నది నేడు ఎడారిగా మారింది. కొన్నేళ్లుగా నదిలో నీటి ప్రవాహం గగనంగా మారింది.. తాగునీటి పథకాలు, సాగునీటి బోర్లకు నీరు అందడం లేదు. నది ఉనికి కోల్పోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
జిల్లాలో నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి, చిట్టమూరు, కోట, వాకాడు మండలాల మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నది నేడు ఎడారిని తలపిస్తోంది. ఈ నదిపై ఆధారపడి కొన్ని వేల ఎకరాల భూములు సాగవ్వాలి. పెళ్లకూరు మండలం నెల్లబల్లి, కలవకూరు, పుల్లూరు, కొత్తూరు, పెళ్లకూరు, పాలచ్చూరు, కప్పగుంటకండ్రిగ గ్రామాలను ఆనుకుని నది విస్తరించి ఉంది. నాయుడుపేట మండలం ఎల్‌ఏసాగరం, తిమ్మాజీకండ్రిగ, చిగురుపాడు, భీమవరం, తుమ్మూరు, అన్నమేడు, మర్లపల్లి, కాల్వగట్టు, మడఫలం గ్రామాల మీదుగా చిట్టమూరు మండలం గునపాడు, గునపాటిపాలెం, మెట్టుల మీదుగా కోట, వాకాడు మండలాల్లోని గ్రామాలను ఆనుకుని ముందుకు సాగుతోంది. పదుల సంఖ్యలో గ్రామాలను ఆనుకుని ప్రవహించే స్వర్ణముఖి నది నుంచే వాటికి తాగునీరు సరఫరా అవుతుంది. నదిలో గతంలో 20, 30 అడుగుల లోతులో నీరు పడటంతో పాయింట్లు వేసి పైపులైన్ల ద్వారా సరఫరా జరిగేది.
పెళ్లకూరు, నాయుడుపేట, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో నదిలో ఏర్పాటు చేసిన రాజీవ్ టెక్నాలజీ పథకాల నుంచి గ్రామాలకు తాగునీటి సరఫరా ఆగిపోయింది. ఒక్కో చోట నుంచి ఐదు నుంచి పది గ్రామాలకు నీరు సరఫరా అయ్యేలా బావులు తవ్వి పైపులైన్లు వేసి నీటి సరఫరా చేస్తారు. నేడు నదిలో నీరు లేకపోవడంతో సరఫరా ఆగింది. తాగునీటి పథకాలు వెలవెలబోతున్నాయి. వేరేచోట పాయింట్లు వేసి నీటిని సరఫరా చేసే ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. నదిలోని పథకాలు పనిచేయక వేరేచోట వేసిన పాయింట్లకు ప్రభుత్వ నిధులు ఖర్చు అవుతున్నాయి. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద స్వర్ణముఖి నదిలోని రాజీవ్ టెక్నాలజీ పథకం నుంచి దొరవారిసత్రం, నాయుడుపేట మండలాలకు నీటి సరఫరా జరుగుతుంది. ఈ పథకం నుంచి నీరు అంతంత మాత్రంగానే వస్తోంది. ఇక్కడి మరో పథకం నుంచి పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు, పెన్నేపల్లి, కానూరు గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. ఇక చావాలి వద్ద స్వర్ణముఖి నది నుంచి శిరనసంబేడు, ఇతర గ్రామాలకు నీరు పోవాల్సి ఉంది. ఈ పథకం కూడా నిరుపయోగంగా మారే అవకాశముంది. నాయుడుపేట పురపాలక సంఘంలో 55 వేల మంది ప్రజలకు నది నుంచే నీరు సరఫరా కావాల్సి ఉంది. ఇక్కడి తాగునీటి బావుల నుంచి నీరు రావడం లేదు. ఫిల్టర్ పాయింట్ల నుంచి నీరు రావడం ఆగిపోయింది. పుర ప్రజలు తాగునీటికి తిప్పలు పడుతున్నారు. ఇక కోట, వాకాడు, చిట్టమూరు, ఓజిలి మండలాల్లోని గ్రామాలకు నది నుంచే నీరు సరఫరా కావాల్సి ఉంది.
స్వర్ణముఖి నది నుంచి సాగునీటి సదుపాయం నేడు ప్రశ్నార్థకంగా మారింది. నది ద్వారా ప్రతి మండలంలో రెండుమూడు సఫ్లయ్ ఛానల్స్ ఉన్నాయి. అప్పట్లో పెద్దలు నది నీరు కాల్వల ద్వారా చెరువులకు చేరేలా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామాల మీదుగా నీరు పారుతూ పంటలకు ఉపయోగపడేలా కాల్వలను నిర్మించారు. నేడు నదిలో నీరు పారక ఈ సఫ్లయ్ ఛానల్స్ నిరుపయోగంగా మారాయి. సాగునీటికి అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక నది పొడవునా గట్టుపై కొన్ని వేల సంఖ్యలో సాగునీటి పాయింట్లు ఉంటాయి. వీటిపై ఆధారపడి కొన్ని వేల ఎకరాల్లో మూడు కార్లు సాగయ్యే అవకాశముంది. కానీ ఆయా పాయింట్ల నుంచి నీరు ఆగిపోయింది.
నది నేడు వ్యర్థాలకు నిలయంగా మారుతోంది. ఇసుక తరలింపు పెరగడంతో కింది నేల, రాళ్లు కనిపిస్తున్నాయి. నీరు భూమిలోకి ఇంకే పరిస్థితులు కానరావడం లేదు. ఇక నీరు పారి కొన్నేళ్లు కావడంతో ఇసుక లేకుండాపోయింది. ఇళ్ల వ్యర్థాలు, చెత్తచెదారం, ప్లాస్టిక్‌తో నది దెబ్బతింటోంది. అయినా సంరక్షణ విషయం నది పొడవునా ఉన్న పాలకులు, ప్రజలు, అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నదిలో ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వేసి నేడు దీనస్థితికి చేరింది.