మంత్రి నారాయణ గెలుపు గుర్రం ఎక్కుతారా? నెల్లూరు వంటి కీలక నగరం నుంచి పోటీ చేసిన ఆయన సర్వశక్తులు ఒడ్డిన నేపథ్యంలో ప్రజలు ఆయనను కనికరిస్తారా ? ఎన్నికల అనంతరం విశ్లేషకులను వెంటాడుతున్న ప్రశ్నలు ఇవే. అ నూహ్య రీతిలో 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన నారాయణ ఎమ్మెల్సీగా ఉంటూనే మంత్రి పదవిని చేపట్టారు. ఇక ఇప్పుడు తాను ఏరి కోరి ఎంచుకున్న నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాదాపు రెండేళ్లకు ముందుగానే ఆయన పక్కా వ్యూహంతో ఇక్కడ రాజకీయాలు చేశారు. తన విద్యాసంస్థలకు చెందిన వారికి ఈ నియోజకవర్గం బాధ్యతల ను అనధికారికంగా అప్పగించారు. సర్వేలు చేయించారు. ఇక్కడ ప్రజల నాడిని పట్టుకున్నారు.నెల్లూరు నగర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారికి ఏం కావాలి? అనే విషయాలపై నారాయణ ముందుగానే సమాచారం సేకరించారు. వారికి అనుకూలంగా వ్యవహరించారు. రహదారులు, మురుగు నీటి పారుదల వంటి కీలక విషయాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో కొద్దికాలంలోనే నగర నియోజక వర్గం ప్రజలకు నారాయణ చేరువయ్యారు. ఇక, ఎన్నికల విషయానికి వస్తే.. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే మంత్రి నారాయణ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. దీనికితోడు ఆయన సతీమణి, కుమార్తెను కూడా ప్రచార పర్వంలోకి దింపారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోయారు. టీడీపీలో అసమ్మతి సెగలు కక్కకుండా చూసుకున్నారు.నెల్లూరు మేయర్ కూడా మంత్రికి అనుకూలంగా వ్యవహరించడంతో నారాయణకు ఒకింత కలిసి వచ్చిందనే చెప్పాలి. దీంతో ఎన్నికల ప్రచారాన్ని దూకుడుగానే నిర్వహించారని చెప్పాలి. రాబోయే ప్రభుత్వంలో తాము ఏం చేస్తామో చెప్పడంతో పాటు.. ప్రస్తుత ప్రభుత్వంలో తాము అందించిన ఫలాలను కూడా ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి మైనస్‌గా మారాయి. ఇది టీడీపీకి అనుకూలంగా మారిందని అంటున్నారు. విజ్ఞుడు, వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న నారాయణ.. ఉంటే తమకు మేలని భావించిన ప్రజల సంఖ్య పెరగడం కూడా మంత్రికి కలిసి వచ్చింది. ఇలా మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. నారాయణ గెలుపుపై మాత్రం ఆశలు చిగురించాయని అన్న టాక్ నెల్లూరులో ఎక్కువుగా వినిపిస్తోంది.